సాక్షి, చెన్నై: రాష్ట్రానికి హుదూద్ గండం తప్పడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడడంతో తీరప్రాంత వాసులు కొంత ఆందోళన చెం దారు. విశాఖపట్టణం, ఒడిశాలకు చెన్నై నుంచి వెళ్లాల్సిన విమాన సేవలు రద్దు చేశారు. అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తుపాన్‌గా మారింది. దీనికి హుదూద్ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఈ తుపాన్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని తొలి నుంచి సమాచారం వెలువడుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే తంజావూరు, తిరువారూర్, నాగపట్నం తదితర డెల్టా జిల్లాల్లో వర్షాలు పడడంతో ఆ ప్రభావం కొంతమేరకు తమిళనాడు మీద ఉండొచ్చన్న భావన సర్వత్రా బయలుదేరింది. ఈ నేపథ్యంలో సముద్ర తీర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత వాసులను, జాలర్లను అప్రమత్తం చేశారు. శనివారం నాగపట్నం తీరంలో అలల తాకిడి క్రమంగా పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నాగపట్నం, పాంబన్, పుదుచ్చేరి హార్బర్లలో రెండో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. జాలర్లను సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. హుదూద్ ప్రభావంతో భారీ వర్షం పడిన పక్షంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలకు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ముందుగా ప్రకటించినట్టే హుదూద్ విశాఖపట్టణం సమీపంలో తీరం దాడడంతో ఇక్కడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రభావంతో సముద్ర తీరాల్లో ఎలాంటి వర్షాలు పడలేదు. అక్కడక్కడా చిరు జల్లులు పడ్డాయి.
కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడడం ఆందోళన కలిగించింది. తిరువళ్లూరు జిల్లా పలవేర్కాడు, చెన్నైలోని ఎన్నూరు, నుంచి కడలూరు, నాగపట్నం, రామనాథపురం, తూత్తుకుడి, కన్యాకుమారి వరకు అలలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. తమిళనాడులో పెరటాశి నెలలో సముద్రం వెనక్కు తగ్గడం సహజం. హుదూద్ ప్రభావంతో అలలు మరింతగా ఎగసి పడడంతో వాటిని చూడడానికి జనం సముద్ర తీరాల బాట పట్టారు. సముద్రానికి సమీపంలోకి వెళ్లడానికి భద్రతా సిబ్బంది ఎవ్వరినీ అనుమతించలేదు. పది నుంచి పదిహేను అడుగుల మేరకు అలలు ఎగసి పడడంతో జాలర్లు సైతం ఆందోళన చెందారు. తమ చిన్న చిన్న పడవల్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చుకున్నారు. కన్యాకుమారి తీరంలో అలల తాకిడి పర్యాటకులకు ప్రత్యేక కనువిందుగా మారింది. హుదూద్ ప్రభావంతో తమిళనాడుకు ఎలాంటి ముప్పు వాటిళ్ల లేదని, ఆకాశం మేఘామృతంగా ఉందని, పలుచోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
విమాన సేవల రద్దు : విశాఖపట్టణం సమీపంలో హుదూద్ తీరం దాటడంతో అక్కడ అల్లకల్లోలం చోటుచేసుకుంది. చెన్నై నుంచి ఉదయాన్నే విశాఖపట్టణం వెళ్లాల్సిన ఇండిగో, ఎయిర్ కోటెస్‌తో పాటు మరో విమానాన్ని రద్దు చేశారు. హుదూద్ ప్రభావం ఒడిశాను సైతం తాకడంతో అక్కడికి చెన్నై నుంచి వెళ్లాల్సిన మూడు విమానాల్ని రద్దు చేశారు. ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్ ద్వారా, ఫోన్ల ద్వారా ముందుగానే సమాచారం అందించారు. విమాన సేవలు రద్దు చేశామని, విశాఖపట్టణం, ఒడిశాలో పరిస్థితులకు అనుగుణంగా సోమవారం విమాన సేవలను పునరుద్ధరిస్తామని మీనంబాక్కం వర్గాలు ప్రకటించాయి.
అలజడి
Published Mon, Oct 13 2014 12:37 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement