డ్యాన్స్‌బార్లు బంద్
- జూన్‌లో బిల్లు మంత్రి పాటిల్ ప్రకటన
- సభ ముందుకు రానున్న 13 బిల్లులు
- శనివారం కూడాఅసెంబ్లీ కొనసాగింపు
సాక్షి ముంబైః ఎన్నో అక్రమాలకు కారణమవుతున్న డ్యాన్స్‌బార్‌లపై నిషేధం విధించాలని ప్రతిపాదిస్తూ ఈ వర్షాకాల సమావేశంలో బిల్లును ప్రవేశపెడతామని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ ప్రకటించారు. వర్షాకాల సమావేశాలు జూన్ రెండో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాల్లో మొత్తం 13 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. వీటిలో పెండింగ్‌లో ఉన్న ఏడు పాత బిల్లులతోపాటు మరో ఆరు కొత్తవి ఉన్నాయి. శాసనసభ సమావేశాల వివరాలు తెలియజేయడానికి హర్షవర్ధన్ పాటిల్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
డ్యాన్స్‌బార్లపై నిషేధం విధించే బిల్లును ఈసారే ప్రవేశపెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు. వీటిపై నిషేధం విధించేందుకు గతంలోనే రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం మరింత పటిష్టంగా లేకపోవడంతో న్యాయస్థానం కొట్టివేసింది. డ్యాన్స్‌బార్ల అనుమతులను నవీకరించడాన్ని రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. ఫలితంగా డ్యాన్స్‌బార్లను ప్రారంభించలేకపోయారు. దీంతో ఈ విషయంపై డ్యాన్స్‌బార్ల యజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు డ్యాన్స్‌బార్ల అనుమతులను ఎందుకు నవీకరించలేదో 15 రోజుల్లోపు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశంలో డ్యాన్స్‌బార్ల నిషేధం బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు హర్షవర్ధన్ పాటిల్ పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంపై హోంశాఖ మంత్రి ఆర్.ఆర్. పాటిల్ మాట్లాడుతూ డ్యాన్స్‌బార్ల నిషేధంపై గతంలో ప్రభుత్వం అమలు చేసిన చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి మరింత పటిష్ట సవరణలు తేవాలా లేక కొత్త బిల్లునే తీసుకురావడమా..? అనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ విషయంపై వచ్చే వారంలోపు నిర్ణయం తీసుకునే అవకాశముందని పాటిల్ చెప్పారు.
జూన్ ఐదున అదనపు బడ్జెట్...
వర్షాకాల సమావేశాల సందర్భంగా జూన్ ఐదున పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా గత సమావేశాల్లో కేవలం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్టు ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పూర్తిస్థాయి బడ్జెట్‌తోపాటు డ్యాన్స్‌బార్ల నిషేధం బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు పాటిల్ వివరించారు.
శనివారం కూడా సమావేశాలు కొనసాగుతాయి...
జూన్ రెండు నుంచి జూన్ 14వ తేదీ వరకు జరగనున్న వర్షాకాల సమావేశాల్లో శనివారం కూడా సభాకార్యకలాపాలు కొనసాగుతాయని మంత్రి హర్షవర్ధన్ పాటిల్ ప్రకటించారు. సాధారణంగా అసెంబ్లీకి శనివారం, ఆదివారం సెలవుదినాలుగా ప్రకటిస్తారు. కానీ ప్రజాస్వామ్య కూటమి చివరి సమావేశాలు కాబట్టి సెలవు రోజైన శనివారం కూడా కార్యకలాపాలు నిర్వహించి మొత్తం 12 రోజులు భేటీలు కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. అధిక సమయం సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కూడా కోరాయి.
1999లో అధికారంలోకి వచ్చిన కాషాయ కూటమి హయాంలో చివరి సమావేశాలు కేవలం నాలుగు రోజులు జరిగాయి. అదే ప్రజాసామ్య కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు 2004, 2009లో చివరి సమావేశాలను దాదాపు 13 రోజులపాటు కొనసాగించాయని మంత్రి వివరించారు. ఈసారి కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని వివరించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలన గడువు అక్టోబరు 25తో ముగియనుంది.
దీనికి ముందు ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తారని మంత్రి హర్షవర్ధన్ పాటిల్ విశదీకరించారు. రాయిగఢ్ జిల్లా కాలాపూర్‌లో 1980లో డ్యాన్స్‌బార్ల సంస్కృతి మొదలయింది. వీటిలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అశ్లీల నృత్యాల కోసం గ్రామీణ ప్రాంతాల బాలికలను బార్ల నిర్వాహకులు కొనుగోలు చేసినట్టు కూడా విమర్శలు వినిపించాయి. దీంతో శివసేన వంటి పార్టీలు డ్యాన్స్‌బార్లు నిషేధం కోసం పోరాడాయి.