సాక్షి, చెన్నై: మరో ఆరుగురిని గురి పెట్టి విచారణకు మద్రాసు హైకోర్టు కసరత్తులు చేపట్టింది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఆరుగురు జిల్లా, సెషన్స్ కోర్టుల్లో మేజిస్ట్రేట్‌లుగా పనిచేస్తున్న, చేసిన వాళ్లే. వీరిపై వచ్చిన ఆరోపణల్ని పరిగణలోకి తీసుకుని త్వరితగతిన చర్యలకు విజిలెన్స్ కమిటీ రంగంలోకి దిగినట్టు సమాచారం.రాష్ట్రంలో ఇటీవల కాలంగా న్యాయ వర్గాలపై ఆరోపణలు, విమర్శలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఒకరిద్దరి కారణంగా మొత్తం వ్యవస్థ విమర్శల్ని ఎదుర్కొంటోంది.
ఇలాంటి వారిపై కొరడా ఝుళిపిస్తూ మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గ్రానైట్ స్కాంను దారి మళ్లించే యత్నం చేసిన మేలూరు కోర్టు న్యాయమూర్తి మహేంద్ర భూపతి, కిడ్నిల రాకెట్ నిందితుల్ని తప్పించే యత్నం చేసిన మరో న్యాయమూర్తి అన్భురాజ్‌లపై చర్యలు తీసుకున్నారు. ఇదే విధంగా మరో ఆరుగురు ఆరోపణల్ని ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. వీరందరిపై పలు రకాల ఫిర్యాదులు, పలు మార్గాల నుంచి ఆరోపనలు వచ్చి ఉండడంతో, వీరిపై కూడా కొరడా ఝుళిపించేందుకు మద్రాసు హైకోర్టు సిద్ధమవుతోంది.
వీరిలో జిల్లా, సెషన్స్ కోర్టుల్లో పనిచేస్తున్న, పనిచేసిన న్యాయమూర్తులు ఎస్. మన్‌వెలి, గణేషన్, వైద్యనాథన్, నల్లతంబి, పీఎస్ నందకుమార్, భవానీశ్వరి ఉన్నారు. తిరుచ్చి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మన్ వెలి ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఆ గడువుకు ఒక్క రోజు ముందుగా మన్ వెలిని సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. ప్రస్తుతం ఆరోపణల్ని ఎదుర్కొంటున్న వారిలో మొదటి వరుసలో మన్‌వెలి ఉన్నారు. ఇక తిరుచ్చి కోర్టు న్యాయమూర్తి నందకుమార్ తన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కుటుంబంతో కలసి ఆత్మహత్యాయత్నం సైతం చేసిన పరిస్థితి.
ఇక ఈరోడ్ న్యాయమూర్తి నల్లతంబి , కారైక్కాల్ న్యాయయమూర్తి వైద్యనాథన్, కున్నూరు మేజిస్ట్రేట్ తంగరాజు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. తంగరాజ్ మీద అయితే, ఏకంగా ఒక మహిళా పోలీసు అధికారి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసి ఉండడం గమనార్హం. ఇలాంటి వారి భరతం త్వరితగతిన పట్టేసి, మరొకరు తప్పులు చేయకుండా హెచ్చరించే విధంగా విచారణను త్వరితగతిన చేపట్టేందుకు మద్రాసు హైకోర్టు విజిలెన్స్ కమిటీ పరుగులు తీస్తుండడం విశేషం.
కర్ణన్ ఉత్తర్వులు రద్దు: ఇదిలా ఉండగా, ఇటీవల బిన్ని మిల్లు కార్మికుల క్వార్టర్స్ ఖాళీ చేయడం వ్యవహారంలో న్యాయమూర్తి కర్ణన్ జారీ చేసిన ఉత్తర్వుల్ని ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ రద్దు చేశారు. కార్మికుల క్వార్టర్స్‌ను ఖాళీ చేయిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌నుపై తొలుత ఆదేశాలు ఇవ్వడం, తదుపరి ఆ ఆదేశాలను పోలీసులు, జిల్లా కలెక్టరు ధిక్కరించారని కేసులు దాఖలయ్యాయి. దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ సుందరవల్లి, పోలీసు కమిషనర్ జార్జ్‌లను బదిలీ చేయాలని కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
తాము చర్యలు తీసుకున్నా, తమ మీద కోర్టు ధిక్కార కేసు దాఖలైందంటూ కమిషనర్, కలెక్టర్ అప్పీలుకు వెళ్లారు. వీరి వాదనల్ని విన్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ఇది వరకు కర్ణన్ నేతృత్వంలోని బెంచ్ దాఖలు చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇది వరకు విచారణ పూర్తి లోతుల్లోకి వెళ్లనట్టుందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఇక, ఎన్నికల కోడ్ అడ్డుతో సుందర వల్లి తిరువళ్లూరుకు బదిలీ కాగా, అమ్మ జయలలిత కన్నెర్ర చేయడంతో చెన్నై కమిషనర్ జార్జ్ జైళ్ల శాఖకు మారిన విషయం తెలిసిందే.
మరో ఆరుగురి పై గురి
Published Sun, Apr 3 2016 1:49 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement