
రాత్రి చలి.. పగలు ఎండ
► ఆదిలాబాద్‌లో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
► సంక్రాంతి నాటికి ఇంకా పెరగనున్న చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా.. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఆరు డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, మెదక్‌లలో రాత్రిపూట చలి పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రెండు రోజులుగా ఖమ్మంలోనూ సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మెదక్, నల్లగొండల్లో సాధారణం కంటే 5 డిగ్రీల చొప్పున తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 6, మెదక్‌లో 9 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, రామగుండంలలో 11 డిగ్రీల చొప్పున, హన్మకొండ, నిజామాబాద్‌లలో 12 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. మరోవైపు అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్, మెదక్‌లలోనూ సాధారణం కంటే 3 డిగ్రీల చొప్పున అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంక్రాంతి పండుగ నాటికి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో చలి పులి
హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. సాయంత్రం ఐదింటి నుంచే చలి మొదలవుతోంది. శనివారం 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 31.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఉదయం, సాయంత్రం చలిగాలులు వీస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. రాత్రి 9 గంటలకే రహదారులపై ట్రాఫిక్ తగ్గుముఖం పడుతోంది.