ఠాణేలో బుధవారం జరిగిన డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మంది ప్రయాణికుల్లో గుర్తు పట్టని నాలుగు మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నారు.
ముంబై: ఠాణేలో బుధవారం జరిగిన డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మంది ప్రయాణికుల్లో గుర్తు పట్టని నాలుగు మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. వారి మృతదేహాలు గుర్తు పట్టనంతగా కాలిపోయాయని, దీంతో డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించామని పశ్చిమ రైల్వే అధికార ప్రతినిధి ఒకరు గురువారం విలేకరులకు తెలిపారు.
బుధవారం ఉదయం 2.35 గంటల ప్రాంతంలో రైలు ఎస్4 బోగీతో పాటు మంటలు అంటుకున్న ఎస్-2, ఎస్-3 బోగీల్లో ప్రయాణికులు వీరు కావచ్చని అనుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ రైల్వే పోలీసుల స్వాధీనంలో ఉన్న ఈ మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆ తర్వాత ఈ మృతదేహాలను వారివారి కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు. పశ్చిమ ముంబైకి 145 కిలోమీటర్ల దూరంలో గోల్వాడ్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో ఓ మహిళతో సహా తొమ్మిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉండటంతో ప్రమాదాన్ని అంచనావేయలేక అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనపై రైల్వే భద్రత కమిషనర్ విచారణ చేస్తున్నారు. ఐదుగరిని దీపికా షా (65), దేవ్ శంకర్ ఉపాధ్యాయ్ (48), సురేంద్ర షా (68), నషీర్‌ఖాన్ అహ్మద్‌ఖాన్ పఠాన్ (50), ఫెరోజ్ ఖాన్ (38)లుగా అధికారులు గుర్తించారు.