విస్తరణపై చర్చలకు ఢిల్లీకి సీఎం
సాక్షి, ముంబై: మంత్రిమండలి విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ ఢిల్లీ పయనం కానున్నారు, మిత్రపక్షాలైన స్వాభిమాని షేట్కారీ సంఘటన్, రిపబ్లికన్ పార్టీ ఆప్ ఇండియా (ఆర్‌పీఐ), శివసంగ్రామ్, రాష్ట్రీయ సమాజ్ పక్ష్ (ఆర్‌ఎస్‌పీ) పార్టీల నుంచి మంత్రి పదవుల కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరిగింది. మంత్రి మండలిలో చేరాలనుకునేవారి సంఖ్య బీజేపీలో కూడా పెద్దగానే ఉంది. దీంతో ఎటూ తేల్చుకోలేని ముఖ్యమంత్రి అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లి, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో చర్చలు జరుపుతారని తెలిసింది.
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం జనవరి మొదటివారంలో మంత్రి మండలిని విస్తరిస్తామని దేవేంద్ర ఫడణ్‌వీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మిత్రపక్షాలను అధికారంలో భాగస్వాములను చేసుకునే విషయంపై ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మిత్రపక్షాల నాయకులైన రామ్‌దాస్ ఆఠవలే, వినాయక్ మెటే, మహాదేవ్ జాన్కర్‌లు మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రీయ సమాజ్ పక్ష్ నేత మహాదేవ్ జాన్కర్ మినహా మిగత పార్టీల నాయకులెవరూ ఉభయ సభల్లోనూ సభ్యులు కారు. పైగా ఈ పార్టీలకు చెందిన ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలుగా లేరు.
ఇలాంటి నేపథ్యంలో మూడు పార్టీలకు చెందిన వారికి మంత్రిమండలిలో స్థానం కల్పిస్తే వారికి శాసనమండలిలో లేదా శాసన సభలో సభ్యత్వం ఇప్పించాల్సిన బాధ్యత కూడా బీజేపీపైనే పడనుంది. ప్రస్తుతం శాసనమండలిలో అయిదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో బీజేపీకి మూడు లభించనున్నాయి. ఈ స్థానాల కోసం బీజేపీకి చెందిన నాయకులే పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో వీటన్నింటిపై బీజేపీ అధిష్టానంతో చర్చించి, నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ పయనం కావాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.