వేశ్యాగృహాలను మూసివేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జీబీ రోడ్డులో ఉన్న 125 వేశ్యాగృహాలను మూసివేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ వాటి నిర్వాహకులకు సమన్లు ఇచ్చింది. వివిధ రకాల ఏజెన్సీలు ఒకదాని కొకటి సంబంధం లేకుండా పొంతనలేని సమాధానాలివ్వడంతో అసలైన నిర్వాహకు లను గుర్తించడం కమిషన్‌కు చాలా కష్టతరమైంది. దీంతో వీరిని సెప్టెంబర్ 21 నుంచి 24 మధ్య తమ వ్యక్తిగత, నివాస ధ్రువీకరణ పత్రాలతో కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్లు ఢిల్లీ మహిళా కమిషన్ అధికారులు తెలిపారు. కొందరు నిర్వాహకులు సమన్లు తీసుకోవడానికి నిరాక రించడంతో వేశ్యాగృహాల గోడలకు వాటిని అంటించామని వారు పేర్కొన్నారు.
ఇంతకుముందే కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్, ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్‌లోని సీనియర్ అధికారులు, ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా మేజిస్ట్రేట్, ఢిల్లీ జల్ బోర్డు, అగ్ని మాపక విభాగం, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల్లోని వారితో ఓ కమిటీ దీని కోసమే ఏర్పాటయింది. ఢిల్లీ మహిళా కమిషన్ లీగల్ కౌన్సిలర్ ప్రిన్సీ గోయెల్, మొబైల్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ కిరణ్ నేగిల ఆధ్వర్యంలోని బృందం ఈ సమన్లు అందజేసింది.
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మైనర్ బాలికలు, యువతులు, మహిళలను జీబీ రోడ్డులోని వేశ్యాగృహాలకు అక్రమంగా తరలించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నా రు. ఇప్పటివరకు ఎన్ని దాడులు జరిగినా ఇక్కడి వేశ్యాగృహాల నిజమైన యజమానులు బయట పడలేదని, కొందరు నిర్వాహకులను మాత్రం పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. పార్లమెంటుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే వ్యభిచారం జరుగుతుండటం సిగ్గు చేటని, దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు.