నగరంలో డెంగీ విజృంభిస్తోంది
Published Sat, Sep 28 2013 12:25 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
నగరంలో డెంగీ విజృంభిస్తోంది. వ్యాధికి కారణమవుతున్న దోమలను నియంత్రించేందుకు కార్పొరేషన్లు ఏమీ చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు దుమ్మెత్తి పోస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విమర్శలను తిప్పికొట్టేందుకు కార్పొరేషన్లు కారణాలను వెతుకుతున్నాయి. సమస్యను పరిష్కరించడంకన్నా ప్రత్యర్థులను ఇరుకునపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే వాటికి కావాల్సింది. కానీ వ్యాధి కారణంగా ఇబ్బంది పడుతోంది మనం. మరి మనకేం పట్టదా?
న్యూఢిల్లీ: డెంగీ మహమ్మారి ఇప్పుడు నగరాన్ని వణికిస్తోంది. ఇంటికొకరు, వాడకు పదిమంది, కాలనీకి వందమంది చొప్పున లెక్కసినట్టుగా ఈ వ్యాధిబారిన పడుతున్నారు. గతవారం రోజులుగా వ్యాధి తీవ్రత మరింత పెరిగింది. ఆస్పత్రులు డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రాణాలు కాపాడే ప్లేట్లెట్ల మాట అటుంచి కనీసం మంచాలు దొరికే పరిస్థితి కూడా లేదు. సరైన సౌకర్యాలు కల్పించలేకపోవడం కార్పొరేషన్లు, రాష్ట్రప్రభుత్వ వైఫల్యమే. మరి దోమల సంఖ్య ఇంతగా పెరిగి, వ్యాధి విజృం భించడానికి కారణమెవరు? అధికారులను, అమాత్యులను విమర్శించడం కాసేపు పక్కనపెట్టేద్దాం. దోమల నియంత్రణ కోసం మనమేం చేస్తున్నామని ప్రశ్నించుకుందాం. మన పరిసరాలను ఎంతగా శుభ్రంగా ఉంచుతున్నాం? దోమల తనిఖీ కోసం వస్తున్న సిబ్బందికి ఏమేర సహకరిస్తున్నామని మన ల్ని మనమే ప్రశ్నించుకుందాం.
పరిశుభ్రత జాడేది?
ధనికులుండే ప్రాంతాలను మినహాయిస్తే సామాన్యులు, జుగ్గీ జోపిడీల్లోకెళ్తే పారిశుద్ధ్యం పరిస్థితి ఎలా ఉందో మనకే అర్థమవుతుంది. నీరు నిల్వ ఉం డకుండా చూసుకోవాలని అధికారులు పదేపదే చెప్పినా మనం పట్టించుకోం. చెత్తను చెత్తకుండీల్లోనే వేయాలని సూచించినా మన చెవికెక్కదు. ఏ ప్రాంతంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది? ఏ రకం దోమలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయో గుర్తించేందుకు వచ్చిన అధికారులకు మనం ఏ మాత్రం సహకరించం. పైగా వారితోనే గొడవకు దిగుతాం. ఇవన్నీ మన ఇబ్బందుల్ని మరింత ఎక్కు వ చేస్తున్నాయి. అధికారులను, సిబ్బందిని నిలదీసి పనులు చేసుకోవాల్సిన మనమే వారు చేస్తున్న పనులకు అడ్డుపడితే వ్యాధి నిర్ధారణ ఎలా జరిగేది? నియంత్రణ చర్యలు ఎలా తీసుకునేది?
ప్రజల నుంచి సహకారం అందడం లేదు: ఎస్‌ఎండీసీ
దోమల నియంత్రణ కోసం తమ కార్పొరేషన్ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోందని, అయితే ప్రజల నుంచి తగినంత సహకారం లభించడంలేదని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మనీశ్ గుప్తా తెలిపారు. తమ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం వరకు 1,698 కేసులు నమోదయ్యాయని చెప్పారు. వ్యాధి నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, అయితే ప్రజల నుంచి తగినంత సహకారం అందడంలేదన్నారు. ఇళ్లల్లో దోమల సంఖ్య ను తనిఖీ చేసేందుకు వెళ్లిన తమ సిబ్బందితో స్థానికులు గొడవకు దిగుతున్నారని, ఫలితంగా ఏ ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు తీసుకోవాలో తెలియడంలేదన్నారు.
నగరంలోని మిగతా కార్పొరేషన్లు కూడా ఇటువంటి సమస్యనే ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏ ప్రాంతంలో ఏ వ్యాధికారక దోమలు ఉన్నాయో గుర్తించినప్పుడే సదరు ప్రాంతాల్లో తగిన నివారణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని, అప్పుడే వ్యాధులు నియంత్రణలో ఉంటాయన్నారు. అయితే దోమల రకాలు, సంఖ్యను గుర్తించేందుకు తమ సిబ్బంది స్థాని కులతో పోరాటాం చేయాల్సి వస్తోందని చెప్పారు.
Advertisement
Advertisement