సాక్షి, ముంబై: బడ్జెట్ సమావేశాల్లో ముస్లిం రిజర్వేషన్ల అంశం కీలకం కానుంది. ఎన్నికలకు ముందు విడిపోయిన రెండు కాంగ్రెస్ పార్టీలు ఈ విషయంలో ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా రిజర్వేషన్ల విషయంపై బీజేపీకి వ్యతిరేకత తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మొదటి బడ్జెట్ సమావేశాలు మార్చి తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభమవనున్నాయి. మార్చి 18న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఒక్కటి కానున్న కాంగ్రెస్, ఎన్సీపీ?
ముస్లీం రిజర్వేషన్ల అంశంతో ఎన్నికలకు ముందు విడిపోయిన రెండు కాంగ్రెస్‌లు ఒక్కటయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ముస్లిం ఓటర్లలో ‘ఎంఐఎం’ పార్టీ ఆదరణ పెరుగుతున్న తరుణంలో రిజర్వేషన్లపై ముస్లింలను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇరు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఇందులో భాగంగా రిజర్వేషన్‌లు రద్దు చేయాలన్న ఆదేశాలు వెనక్కితీసుకోవాలని బీజేపీని పట్టుబడుతున్నాయి. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరించాయి. గతంలో ముస్లిం వర్గం ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు ఓటుబ్యాంకుగా ఉండేవి. అయితే ఎంఐఎం వచ్చిన తర్వాత అనేక మంది ముస్లిం ఓటర్లు ఎంఐఎం వైపు మొగ్గుచూపుతున్నారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకోవడమే ఇందుకు ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ముఖ్యంగా రాబోయే ఔరంగాబాద్, ముంబై, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచకుని ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.ఎంపీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్‌తోపాటు ఎన్సీపీ అధ్యక్షుడు సునీల్ తట్కరే బీజేపీ తన ఆదేశాలను రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేదిలేదని సమాచారం.
రిజర్వేషన్ రద్దు కాలేదు-ముఖ్యమంత్రి..
ముస్లీం రిజర్వేషన్‌లలో ఎలాంటి మార్పు లేదని అలానే కొనసాగుతాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాకు తెలిపారు. రిజర్వేషన్లు రద్దు చేశారనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తమ ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ (అందరితో, అందరి వికాసం) అనే నినాదంతో ముందుకు వెళ్తుందన్నారు.
బడ్జెట్‌లో ‘ముస్లిం’లే కీలకం
Published Fri, Mar 6 2015 10:22 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement