డిమాంటి కాలనీ షూటింగ్ ప్రారంభం
హర్రర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోందనే చెప్పాలి. యువ హీరో అరుళ్‌నిధి సైతం హారర్ కథా చిత్రాల బాట పట్టారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం డిమాంటి కాలనీ. హర్రర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా ఏఆర్ మురుగదాస్ శిష్యుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు మెగాఫోన్ పడుతున్నారు. ఈయన 7 ఆమ్ అరి వు, తుపాకీ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. మోహనా మూవీస్, శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం చెన్నైలో జరిగాయి. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది మూడు కాల ఘట్టాల్లో జరిగే యథార్థ గాథ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు.
భయానక సన్నివేశాలతో కూడిన హర్రర్ కథా చిత్రం డిమాంటి కాలనీ అని తెలిపారు. ఒక ప్రముఖ నటి హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో రమేష్ తిలక్, అభిషేక్ సానత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పా రు. చిత్రం కోసం మూడు కాల ఘట్టాలను ఆవిష్కరించే విధం గా మూడు బ్రహ్మాండమైన సెట్స్‌ను వేస్తున్నట్లు తెలిపారు. చిత్రానికి సంతోష్ శివన్ శిష్యుడు అరవింద్ సింగ్ చాయాగ్రహణం, ఏఆర్ రెహ్మాన్ శిష్యుడు కెపాజరమియా సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. మా వీరన్, 7 ఆమ్ అరివు, నాన్ ఈ చిత్రాలకు అబ్బురపరిచే గ్రాఫిక్స్‌ను రూపొందించిన కమలకన్నన్ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందిస్తున్నారని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను నాన్‌స్టాప్‌గా చెన్నై, పొల్లాచ్చి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఏ కే తమిళరసు, ఎన్.మురళి, ఏఆర్ మురుగదాస్, పాండియరాజ్ తదితరులు విచ్చేసి చిత్ర యూనిట్‌కు ఆశీసులు అందించారు.