
నిర్వీర్యం
న్యాయమూర్తి వై.భాస్కర్‌రావును లోకాయుక్త పదవి నుంచి తప్పించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కర్ణాటక ...
లోకాయుక్తను కోరలు లేని పాముగా మారుస్తున్నారు
{పభుత్వంపై విరుచుకు పడిన విపక్ష ఎమ్మెల్సీలు
వాదనలతో లోకాయుక్త సవరణ బిల్లుకు ఆమోదం
బెంగళూరు : న్యాయమూర్తి వై.భాస్కర్‌రావును లోకాయుక్త పదవి నుంచి తప్పించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కర్ణాటక లోకాయుక్త(సవరణ) ముసాయిదా బిల్లు-15తో లోకాయుక్త సంస్థ పూర్తిగా కోరల్లేని పాములా మారిపోనుందని ప్రభుత్వంపై విపక్ష ఎమ్మెల్సీలు విరుచుకుపడ్డారు. లోకాయుక్త(సవరణ) ముసాయిదా బిల్లును రాష్ట్ర న్యాయ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.బి.జయచంద్ర శుక్రవారం శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో విపక్ష సభ్యుడు సోమణ్ణ మాట్లాడుతూ.... ప్రస్తుతం లోకాయుక్తపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో లోకాయుక్తను ఆ పదవి నుంచి తప్పించేందుకంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లును రూపొందించిందని, అయితే ఈ బిల్లు పూర్తిగా గందరగోళంగా ఉందని అన్నారు. ఈ బిల్లును ఎందుకోసమైతే రూపొందించారో ఆ లక్ష్యం నెరవేరకుండా, పూర్తిగా లోకాయుక్త సంస్థనే నిర్వీర్యం చేసే అంశాలను బిల్లులో చేర్చారని విమర్శించారు.
ఇక అసెంబ్లీ సమావేశాలు ముగిసే సందర్భంలో ఇంత హుటాహుటిన ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని సోమణ్ణ ప్రశ్నించారు. అసలు లోకాయుక్తను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత గా ప్రయత్నించిందో ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప మద్దతునిస్తూ లోకాయుక్త సంస్థకు అవినీతి దయ్యం పట్టుకుందని విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుత బిల్లు ప్రకారం లోకాయుక్తను పదవి నుంచి తప్పించడం సాధ్యం కాదని, న్యాయనిపుణులతో చర్చించి ఈ బిల్లులో మార్పు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇదే సందర్భంలో లోకాయుక్తగా ఇతర రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులను కాకుండా కర్ణాటకకే చెందిన వారినే నియమించేలా విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా కర్ణాట క లోకాయుక్త(సవరణ) ముసాయిదా బిల్లు శుక్రవారం సాయంత్రం సమయంలో శాసనమండలిలో ఆమోదం పొందింది.