ఆకాశాన ఆకాంక్ష! | district people expecting more funds in state budget. | Sakshi
Sakshi News home page

ఆకాశాన ఆకాంక్ష!

Published Wed, Mar 15 2017 11:16 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

district people expecting more funds in state budget.

► అబద్ధాల హోరు.. ప్రచారాల జోరుతో బాబు పాలన
► జిల్లాపై నాడు వరాల జల్లు కురిపించిన టీడీపీ
► కీలకమైన ప్రాజెక్టులు రూపొందిస్తామని ప్రకటన
► నేటికీ ఒక్క సంస్థ కూడా కాలుపెట్టని వైనం
► మూడేళ్లుగా కాకి లెక్కలతో దబాయింపు
► మూతబడుతున్న పాత పరిశ్రమలు
► రోడ్డున పడుతున్న వేలాది మంది కార్మికులు
► ఆవిరవుతున్న జిల్లా ప్రజల ఆశలు
► నేడు శాసనసభలో ఏపీ బడ్జెట్‌


"తప్పెట్లోయ్‌.. తాళాలోయ్‌ దేవుని గుడిలో మేళాలోయ్‌" ఇది చిన్నారుల పాట
"మా బాబేనోయ్‌.. రాష్ట్రాన్ని కాపాడేదోయ్‌" ఇది టీడీపీ నేతల కీర్తన
ఇప్పుడు ఎన్నికలు లేవు.. హడావుడీ లేదు ఒక్కసారి 2014 సార్వత్రిక ఎన్నికల బటన్‌ను రివైండ్‌ చేస్తే.. లెక్కలేనన్ని బాబు వాగ్దానాలు జనాలను ఆశల పల్లకీ ఎక్కించాయి ఇందులో జిల్లా ప్రజలూ ఉన్నారు ఎన్నో ప్రాజెక్టులు వస్తాయని ఆశించారు కానీ సున్నా సంస్థలే ఈ నేలపై కాలు పెట్టాయి నేడు బడ్జెట్‌ ప్రసంగం నూతన అసెంబ్లీలోకి రానుంది ఈ సారి ఎన్ని పేలని టపాకాయలు ఇస్తారో!!!


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎస్‌.. హి బ్రీఫ్డ్ టు జిల్లా..1, 2, 3, 4, 5....  ఇలా ఎన్నో వరాలు ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. మైకు పట్టుకొని ‘మీకు నేనున్నా’ అని తేల్చి చెప్పారు. కానీ ఒకటి.. రెండు.. మూడు ఇలా ఏళ్లు దొర్లుతున్నాయి. ఒక్క మాటా నెరవేరలేదు. కాకి లెక్కలు.. హంస నడకలే మిగిలాయి రాష్ట్రంలో 10 లక్షల కోట్లతో పరిశ్రమలు నెలకొల్పామని ఆర్భాటంగా  ప్రచారం చేస్తున్న బాబు సర్కార్‌ జిల్లాలో పట్టుమని ఒక్క పరిశ్రమ కూడా నెల కొల్పలేదు. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు. గతంలో ఉన్న పాత పరిశ్రమలు సైతం ప్రభుత్వ ప్రోత్సాహం లేక మూతబడుతున్నాయి. లక్షలాది మందికి కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు సైతం పోగొట్టుకొని రోడ్డునపడాల్సిన పరిస్థితి నెలకొంది.

వీటి సంగతి అంతేనా?: చంద్రబాబుఅధికారం చేపట్టగానే ప్రకాశం జిల్లాలోని దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పుతామని ప్రకటించారు. ఇతర దేశాల నుంచి పరిశ్రమలు వస్తున్నాయని హడావుడి చేశారు. అయితే ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాలను సందర్శించడం మినహా ఇప్పటికీ ఒక్క పరిశ్రమను కూడా నెలకొల్పలేదు. ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న మూడు, నాలుగు సంస్థలు సైతం ముందుకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ప్రధానంగా నీరు, పోర్టు, రోడ్లు, విమానాశ్రయం లాంటి సౌకర్యాలు లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ ఒక్క పరిశ్రమను నెలకొల్పకపోయినా బాబు ప్రభుత్వం మాత్రం ఎంఓయూలు లెక్క కట్టి లక్షల కోట్ల పరిశ్రమలు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం గమనార్హం.

ముందడుగు వేసి.. ఆగిన సంస్థలు ఇవే..: రంగా ఫర్టికల్‌ బోర్డు (ఆగ్రో బేస్డ్‌ సంస్థ), కందుకూరు మండలం కోవూరు వద్ద పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీంతో పాటు బీబీఎల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (మినరల్‌ బేస్డ్‌) మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద, వీఎస్‌ఎల్‌ సోలార్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పొన్నలూరు మండలం వేలటూరు వద్ద, ఆర్‌కేఎస్‌ టెక్నో విజన్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పవర్‌ జనరేషన్‌) వెలిగండ్ల మండలం మొగుళ్లూరు వద్ద, స్ప్రింగ్‌బీ డెయిరీ ప్రోడక్ట్‌ (ఫుడ్‌ అండ్‌ ఆగ్రో) పొదిలి మండలం, ఓగులక్కపల్లి గ్రామం వద్ద పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. ఇదే తరహాలో జాసన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఫెర్టిలైజర్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌), మోహన్‌ వెల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఇండస్ట్రీయల్‌ పార్కు), రంగా ఫర్టికల్‌ బోర్డు, చైనాకు చెందిన కన్సార్టియం ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలు, తమిళనాడుకు చెందిన మోహన్‌ సింటెక్స్‌ టెక్స్‌టైల్స్‌ తదితర కంపెనీలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం దొనకొండతో పాటు పలు ప్రాంతాలను పరిశీలించారు. అయితే వీటిలో ఏ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాకపోవడం గమనార్హం.

పారిశ్రామిక రాయితీకి ఎసరు: రాష్ట్ర విభజన చట్టప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన పారిశ్రామిక పన్ను రాయితీలపై కేంద్రం సెప్టెంబర్‌ 30న కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాలకు పారిశ్రామిక పన్ను రాయితీలను కల్పిస్తూ సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాయలసీమ జిల్లాలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. అయితే వెనుకబడిన ప్రకాశం జిల్లాకు మాత్రం ఈ జాబితాలో చోటు కల్పించలేదు. విభజన చట్టప్రకారం 2015 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకు ఐదేళ్ల పాటు జిల్లాలో నెలకొల్పబోయే పరిశ్రమలకు 15 శాతం తరుగుదల పన్ను, పరిశ్రమ ప్లాంట్, కొత్త యంత్రాల వ్యయంపై 15 శాతం పెట్టుబడి అలవెన్సులు రావాల్సి ఉంది. ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్‌ 32(1), (2ఎ), సెక్షన్‌ 32 ఏడీ ప్రకారం ఈ ఏడు జిల్లాలను కేంద్రం నోటిఫై చేసింది.

అన్నీ ఉత్త లెక్కలేనా?: పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం డిసెంబర్‌ 20 నాటికి జిల్లాలో 85 పెద్ద, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. రూ. 2,928.80 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పిన ఈ పరిశ్రమల ద్వారా 22,093 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఇవికాక జిల్లావ్యాప్తంగా 7,593 చిన్న పరిశ్రమలున్నాయి. రూ. 2,040.93 కోట్లతో ఏర్పాటైన ఈ పరిశ్రమల ద్వారా 81,277 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రోత్సాహకాల మాట మరచిన సర్కారు: ప్రభుత్వం ఎటువంటి రాయితీలు, ప్రోత్సాహకాలివ్వకపోవడంతో పరిశ్రమలు ముందుకు నడిచే పరిస్థితి లేకుండాపోయింది. ట్యాక్సులు పెంచడం, అదనపు పన్నులు వేయడం, విద్యుత్‌ చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెంచటం తదితర కారణాలతో చిన్న పరిశ్రమలు మూతబడుతున్నాయి. జిల్లాలో మొత్తంగా 7678 పరిశ్రమలుండగా చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత దాదాపు 30 శాతం పరిశ్రమలు (2000లకుపైగా)  మూతబడినట్లు సమాచారం. విద్యుత్‌ బిల్లులతో పాటు బ్యాంకు రుణాలకు సంబంధించిన కంతులు చెల్లించలేక ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి. దీంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు. కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోననైనా ప్రభుత్వాలు చిన్న పరిశ్రమలకు రాయితీలు కల్పించాల్సి ఉన్నా చంద్రబాబు సర్కారు ఏ మాత్రం స్పందించటం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement