కళ్లెదుటే కార్మిక ద్రోహం
వనం దుర్గాప్రసాద్, ఎలక్షన్ సెల్: ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి కార్మిక వర్గం నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. ఆయన ఏలుబడిలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డ గడ్డు పరిస్థితులే శ్రామిక లోకానికి గుర్తుకొస్తున్నాయి.
బాబు హయాంలో సంస్కరణల పేరు తో 87 ప్రభుత్వ రంగ సంస్థల నడ్డి విరిచారనేది కార్మిక సంఘాల ప్రధాన ఆరోపణ. 1994- 2004 మధ్యకాలంలో 22 సంస్థలను మూసి వేశారు. మరో 12 సంస్థలను పునర్‌వ్యవస్థీక రించారు. 11 సంస్థలను ప్రైవేటీకరించారు. 9 సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించారు.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 54 సంస్థల తలరాతనే చంద్రబాబు మార్చేయడం అప్పట్లో విమర్శలకు కారణమైంది. ప్రభుత్వరంగ సంస్థ ల అమ్మకాల్లో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనేది ఆరోపణ.
రాష్ట్ర స్థాయి సంస్థలు, కో-ఆపరేటివ్ సంస్థల మార్కెట్ విలువ రూ.636 కోట్ల వర కూ ఉంటే కేవలం రూ.209 కోట్లకే అమ్మారనే దానికి బాబు వద్ద సరైన సమాధానం లేదు.
ఏమిటీ దారుణం?
చంద్రబాబు అధికారంలోకి వచ్చే వరకూ సజావుగా లాభాలతో నడిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు దివాలా తీశాయో, ఆ తర్వా త అవి టీడీపీ నాయకగణం చేతుల్లోకి వెళ్లాక ఎలా లాభాల బాట పట్టాయో విడ్డూరమే. ఈ క్రమంలో అనేక మంది కార్మికులు ఇంటిదారి పట్టినా చంద్రబాబు సర్కారుకు పట్టలేదు.
2002లో హనుమాన్, ఏఎస్‌ఎం కో ఆప రేటివ్ షుగర్‌మిల్స్, డెల్టా పేపర్ మిల్స్‌ను కారు చౌకగా కట్టబెట్టడం, టీడీపీ ఎంపీ నామా నాగే శ్వరరావుకు పాలేరు షుగర్స్ ధారాదత్తం చేయ డం, బాబుకు సన్నిహితుడు మండవ ప్రభాకర్ రావుకు చెందిన ఎన్‌ఎస్‌ఎల్ గ్రూప్‌నకు షుగర్ మిల్లు, స్పిన్నింగ్ మిల్లును రాసివ్వడం సభా సంఘాలనే విస్మయపరచింది.
ఇదో పెద్ద దోపిడీ
నిజాం షుగర్స్ బాబును ఇప్పటికీ వెంటాడే శాపమే. ఉద్దేశపూర్వకంగా ఈ పరిశ్రమ వెన్ను లో కత్తి దూసిన వైనాన్ని కార్మిక లోకం నేటికీ జీర్ణించుకోలేకపోతోంది.
- షక్కర్‌నగర్, మెట్‌పల్లి, ముంబోజిపల్లి చక్కెర మిల్లులతో పాటు షక్కర్‌నగర్ డిస్టిలరీని విక్రయిం చిన వ్యవహారంలో ప్రభుత్వానికి 300 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని శాసనసభా సంఘం అంచనా వేసింది. నిజాం షుగర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 173 కోట్లు సాయం చేసిందంటూ 2000 సెప్టెంబర్ లో చంద్రబాబు తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని ఉటంకించింది. వివిధ కార్పొరేషన్స్ ద్వారా నిజాం షుగర్స్ రుణాలు తీసుకుందని వెల్లడించింది.
- నిజాం షుగర్స్ నాలుగు యూనిట్ల భూములను చంద్రబాబు ప్రభుత్వం నామమాత్రపు ధరకు అమ్మేసింది. అదీ శాసనసభ రద్దయిన తర్వాత.
- తన హెరిటేజ్ కోసం వేలాది రైతులు, ఉద్యోగుల పొట్టగొట్టారనే ఆరోపణలకు చంద్రబాబు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారు.