పొదుపనేది కేవలం డబ్బుకు మాత్రమే పరిమితం చేస్తే సరిపోదు. డబ్బు ఖర్చు చేసి కొనుక్కునే ప్రతి వస్తువునూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రత్యేకించి ఇంట్లోవాడే వంటగ్యాస్.. కరెంటు, బైక్‌లో పోసే పెట్రోల్ వంటివాటిపై శ్రద్ధపెట్టాలి. మనకు తెలియకుండానే వీటి కోసం చేసే ఖర్చు వేల రూపాయలకు చేరిపోతుంది. అందుకే ఇంధనాలను పొదుపుగా వాడితే ధనాన్ని పొదుపు చేసినట్లేనంటారు మేనేజ్‌మెంట్ గురువులు.
న్యూఢిల్లీ: పొదుపుతోనే ఇంధనం ఖర్చు ఆదా చేసుకోవచ్చు. వంట గ్యాస్‌ను వృథా చేయకుండా ఉపయోగించుకోవాలి. వంట వండేటప్పుడు అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. స్టౌను అవసరమున్నప్పుడే వెలిగించాలి. దీంతో ఇంధనం వృథా కాకుండా ఆదా అవుతుంది. వాహనాలను నడిపేటప్పుడు సైతం పొదుపు చర్యలు పాటించాలి. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు లేదా సిగ్నల్‌లో వాహనం ఆగిపోయినప్పుడు వెంటనే ఇంజన్‌ను ఆఫ్ చేయాలి. బండి ఇంజన్ చెడిపోకుండా ఎప్పటికప్పుడు చెక్ చేయించాలి. బైక్‌ను ఎప్పుడూ కండిషన్‌లో ఉంచుకోవాలి.
అప్రూవ్డ్ గ్యాస్ కిట్లు ఉంటే బెస్ట్..
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కారు నడిపేవారు ఎక్కువమంది గ్యాస్‌కిట్‌లపై ఆసక్తి చూపుతున్నారు. అయితే అప్రూవ్డ్ గ్యాస్‌కిట్లు ఉంటేనే మేలు. వీటిని మాత్రమే వాడాలి. లేకుంటే గ్యాస్ వృథా అయ్యే అవకాశం ఉంది. టైర్లలో గాలి ఎప్పుడూ చెక్ చేసుకోవాలి. నిర్ణీత సమయంలో ఆయిల్ మార్చుతూ సర్వీసింగ్ చేయించాలి. కార్లలో ఏసీని అవసరం మేరకు వాడుకోవాలి. కాలం చెల్లిన వాహనాల స్థానంలో కొత్తవి వాడితే మంచింది.
సైకిల్ బెటర్..
నేటి రోజుల్లో సైకిల్ వాడకం చాలా తగ్గిపోయింది. ఏ చిన్న పని కైనా వాహనాన్నే ఉపయోగిస్తున్నారు. దీంతో అటు ఇంధనం ఖర్చవడంతోపాటు ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. దగ్గర్లో చేసుకోవాల్సిన చిన్నచిన్న పనులకు వాహనాలకు బదులు సైకిల్‌పై వెళ్తే, అటు వ్యాయామానికి వ్యాయామం.. ఇటు ఇం‘ధనం’ కూడా ఆదా అవుతుంది.
వారానికి ఒక్కసారైనా సైకిల్ తొక్కండి..
చురుకుగా ఉండాలంటే వారానికి ఒక్కసారైనా వాహనాలను పక్కనబెట్టి సైకిల్ తొక్కాలి. ఇంధనం ఆదా కావడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. సైకిల్ వినియోగంపై రాజధాని ఢిల్లీలో అనేక సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులకు పోటీలు నిర్వహించి సైకిళ్లను బహుమతిగా అందజేస్తున్నాయి. ఇలా సైకిల్ తొక్కడంపై ప్రజలకు అవగాహన కల్పించడం వల్ల కూడా ఇంధనం పొదుపు చేసినవారమవుతాము.
విద్యుత్‌ను ఆదా చేయాల్సిందే.
విద్యుత్‌ను సైతం పొదుపు చేయకుంటే ఇబ్బందులు తప్పవు. పాత బల్బుల స్థానం సీఎఫ్‌ఎల్ (కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంపు) బల్బులు వాడాలి. ఇంట్లోని ఫ్యాన్లు, టీవీ, కంప్యూటర్లు, వాషింగ్ మిషన్, సెల్‌ఫోన్లు, బల్బులను అవసరాలకు అనుగుణంగా వాడాలి. ఎవరూ లేనప్పుడు ఫ్యాన్లను ఆపేయాలి.
పొదుపు చేస్తే ఇం‘ధనమే’!
Published Wed, Aug 27 2014 10:22 PM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement
Advertisement