కెప్టెన్ ఆశ నిరాశేనా?
రాజకీయంగా ఎన్నో ఆశలు పెట్టుకుని ఢిల్లీకి వెళ్లిన డీఎండీకే బృందం నిరాశతో వెనుదిరిగింది. ఎన్నికల పొత్తుపై ఒక్క అడుగుకూడా ముందుకు పడని స్థితిలో
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాజకీయంగా ఎన్నో ఆశలు పెట్టుకుని ఢిల్లీకి వెళ్లిన డీఎండీకే బృందం నిరాశతో వెనుదిరిగింది. ఎన్నికల పొత్తుపై ఒక్క అడుగుకూడా ముందుకు పడని స్థితిలో పార్టీ అధినేత కెప్టెన్ సహా ఎమ్మెల్యేలంతా ఆదివారం చెన్నై చేరుకున్నారు. ఈనెల 21వ తేదీన నోటిఫికేషన్, ఎన్నికలు ఏప్రిల్లో అంటూ ప్రధాన ఎన్నికల కమిషన్ వేగంగా దూసుకొస్తోంది. అందుకు విరుద్ధంగా అతినెమ్మదిగా డీఎండీకే రాజకీయం సాగుతోంది. అన్ని పార్టీలను తన చుట్టూ తిప్పుకున్న విజయకాంత్ చివరకు కాంగ్రెస్ చుట్టూ తాను తిరిగే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర సమస్యలపై ప్రధానిని కలిసే సాకుతో 20 మంది ఎమ్మెల్యేలు, సతీమణి, బావమరిదితో కలిసి ఢిల్లీ పయనమయ్యూరు. పనిలో పనిగా పొత్తులు కూడా ఖరారు చేసుకోవాలని ఆయన ఆశించారు. అనుకున్న షెడ్యూలు ప్రకారం ఈనెల 14వ తేదీన ప్రధానిని కలవడం పూర్తయినా చెన్నైకి బయలుదేరలేదు.
15వ తేదీన కాంగ్రెస్, బీజేపీ అధిష్టానాలతో చర్చలు జరిపి పొత్తుపై ఒక నిర్ణయానికి రావాలని భావించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున ఢిల్లీలో అందుబాటులో లేరు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను సైతం కెప్టెన్ కలవలేకపోయారు. పొత్తులను ఖరారుచేసుకుని చెన్నైకి చేరుకుంటే గౌరవ ప్రదంగా ఉంటుందని కెప్టెన్ వేసుకున్న అంచనాలు తల్లకిందులైనాయి. డీఎండీకే వైఖరి వల్ల పొత్తులపై ఏర్పడిన ప్రతిష్టంభన యథాప్రకారం కొనసాగుతోంది. ఉదయం 12 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న విజయకాంత్‌ను మీడియా చుట్టుముట్టి పొత్తులపై ప్రశ్నల వర్షం కురింపించింది. సహనం కోల్పోయిన విజయకాంత్ మీడియాను ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలను ప్రధానికి వివరించేందుకు ఢిల్లీకి వెళ్లాను, ప్రధానితో ఎవరైనా పొత్తు చర్చలు జరుపుతారా అంటూ తన అసహనాన్ని వెళ్లగక్కారు. ఏదో ఒక ముగింపుతో విజయకాంత్ వస్తారని ఆశతో ఎదురుచూస్తున్న డీఎండీకే కార్యకర్తలు నిరాశ నిస్పృహల్లో మునిగిపోయూరు.