- మళ్లీ పాత నినాదం
- కెప్టెన్ నిర్ణయం
- ఇలంగోవన్ వ్యాఖ్య
- ఆ మూడు చోట్ల బరిలో అభ్యర్థులు
- స్థానికంతో సత్తా
చెన్నై : పార్టీ ఆవిర్భావంతో అందుకున్న నినాదాన్ని మళ్లీ తారక మంత్రంగా స్వీకరించి ప్రజల్లోకి వెళ్లేందుకు కెప్టెన్ నిర్ణయించారు. తంజావూరు, అరవకురిచ్చిలతో పాటు తిరుప్పర గుండ్రం ఉపఎన్నికలో ఒంటరిగా తమ అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు కసరత్తుల్లో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా ఆ పార్టీ కోశాధికారి ఇలంగోవన్ స్పందించడం గమనార్హం.
డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తానే అంటూ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాన ప్రతి పక్ష స్థాయికి ఎదిగిన నాయకుడు డీఎండీకే అధినేత విజయకాంత్. పార్టీ ఆవిర్భావంతో ఐదేళ్లు ఒంటరిగా పయనం సాగించి, తదుపరి అన్నాడీఎంకేతో కలిసి ఎదుర్కొన్న ఎన్నికలతో ప్రజల మన్ననల్ని అందుకున్నారు.
అయితే, ఇటీవలి ఎన్నికల్లో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పాతాళంలోకి నెట్టింది. కింగ్ కావాలన్న ఆశతో ఈ కింగ్‌మేకర్ ప్రజా సంక్షేమ కూటమికి నేతృత్వం వహించి చతికిల బడ్డారు. అడ్రస్సు గల్లంతు చేసుకుని, చేసిన తప్పునకు ఇప్పుడు పశ్చాత్తాపంలో పడ్డారని చెప్పవచ్చు. కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకునేందుకు బలోపేత నినాదాన్ని అందుకున్నారు. బలోపేతం లక్ష్యంగా పార్టీ వర్గాలతో ఏకంగా పది రోజులు చర్చించి, సమీక్షించి చేసిన తప్పులు మళ్లీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారు. గతంలో ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఆదరణ లభించిన దృష్ట్యా, మళ్లీ అదే నినాదంతో ముందుకు సాగేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇక, తాను ఒంటరి...ప్రజలతోనే పొత్తు అంటూ బయట నుంచి ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గానీయండి, అరవకురిచ్చి, తంజావూరు ఎన్నికలు, తిరుప్పరగుండ్రం ఉప ఎన్నికల్ని ఒంటరిగా ఎదుర్కొనేందుకు కసరత్తుల్లో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా డీఎండీకే కోశాధికారి ఏఆర్ ఇళంగోవన్ గురువారం స్పందించడం గమనార్హం. ధర్మపురిలో జరిగిన ఓ కార్యక్రమానంతరం మీడియా ప్రశ్నలకు ఇలంగోవన్ సమాధానాలు ఇచ్చారు.
డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తి రాష్ట్రంలో డీఎండీకే మాత్రమేనని, కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. స్వలాభం కోసం కొందరు పార్టీని వీడారని, నిజమైన అభిమానం పార్టీలోనే ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇక, ఏ ఎన్నికలు అయినా సరే ఒంటరిగానే ఎదుర్కొనేందుకు తమ అధినేత నిర్ణయించారని, అందుకు తగ్గ పయనం సాగనున్నదని వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒంటరిగానే ఎదుర్కొంటామని, ఇక ఏ కూటమి లేదని, అవసరం అయితే, ఎవరైనా తమ గొడుగు నీడకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. వాయిదా పడ్డ ఆ రెండు నియోజకవర్గాలు, తిరుప్పర గుండ్రం ఉప ఎన్నికల్లో డీఎండీకే అభ్యర్థులు పోటీలో ఉంటారని, ఒంటరి పయనం, ఇక ప్రజలతో తమ అధినేత కెప్టెన్ పొత్తు అంటూనే, అసెంబ్లీలో డీఎంకే అధినేత కరుణానిధి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.