నేడు డీఎంకే ఉన్నతస్థాయి సమావేశం
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు పిలుపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ప్రతిపక్ష డీఎంకే సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి డీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా హాజరు కావాలని పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ ఆదివారం సూచించారు.
అన్నాడీఎంకేలో కొనసాగుతున్న వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని డీఎంకే భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు చెన్నై తేనాంపేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం ›జరగనుంది. ప్రతిపక్ష నేత స్టాలిన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
చిన్నమ్మ ‘సామాజిక’ ఉద్యమం!
- ప్రచారం కోసం 760 బృందాల ఏర్పాటు
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పైచేయి సాధించడం కోసం పన్నీర్ సెల్వం, శశికళ వేస్తున్న ఎత్తులతో తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారంతో ప్రజల మద్దతు కూడగట్టడంలో పన్నీరు సెల్వం కాస్త ముందున్నారు. ఈ విషయంలో వెనకబడ్డామని గుర్తించిన శశికళ వర్గం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. శశికళ నివాసంలో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో దీనిపై చర్చించారు. పార్టీ ఐటీ విభాగం కార్యదర్శి రాజ్ సత్యన్ నాయకత్వంలో ఐదువేల మందితో 760 బృందాలను ఏర్పాటు చేశారు.
దీంతో ఆదివారం రాత్రి నుంచి చిన్నమ్మకు మద్దతుగా సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. దీంతో పాటు పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు విస్తృతంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పన్నీరుపై ఎదురు దాడి చేయాలని శశికళ పురమాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తాలూకాలోనూ తమకు మద్దతుగా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు చేయడం, వాల్ పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం హోరెత్తించేందుకు చిన్నమ్మ రంగంలోకి దిగారు. కాగా... తమ వర్గంలోని నాయకులు, కార్యకర్తలెవరూ శశికళను చిన్నమ్మ అని సంబోధించరాదని పన్నీరు వర్గం ఆదేశించింది.