అసెంబ్లీని ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ కే రోశయ్య చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు బుధవారం జరిగిన శాసనసభ సమావేశాలు రసాభాసగా మారాయి. విపక్ష సభ్యులంతా అధికార పక్షంపై విరుచుకుపడడంతోగందరగోళం నెలకొంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17న ప్రారంభం కాగా గవర్నర్ రోశయ్య తన ప్రసంగంలో రాష్ట ప్రభుత్వ పథకాలను ప్రశంసించారు. దీనిపై సహజంగానే విపక్షాలు విమర్శలను గుప్పించాయి. గవర్నర్ హోదాలో ఉన్న రోశయ్య అన్నాడీఎంకే నేతలాగా వ్యవహరించారని డీఎంకే అధినేత కరుణానిధి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో సైతం డీఎంకే సభ్యులు అధికార పక్షాన్ని విమర్శలతో ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. ధన్యవాద తీర్మానంపై శాసనసభాపక్ష ఉపనేత పొల్లాచ్చి జయరామన్ మాట్లాడుతూ, జయ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. క ర్ణాటక జైలులో ఉన్నపుడు జయ ముఖార విందాన్ని ఎప్పుడు చూస్తామోనని ప్రజలు తపించారన్నారు.
అందుకే ఆమె మాజీ ముఖ్యమంత్రికాదు ప్రజల ముఖ్యమంత్రిగా కీర్తినొందారని అన్నారు. జయను వరుసగా కీర్తించడంపై డీఎంకే సభ్యులు అడ్డుతగిలి ప్రసంగించబోగా స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా స్పీకర్ పోడియంను కొద్దిసేపు చుట్టుముట్టారు. జయరామన్ ఒట్టి అమాయకుడని వ్యాఖ్యానించారు. 2011 తరువాత వచ్చిన ప్రతి ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించిందని అధికార పక్ష సభ్యులు చెప్పడంతో తాజావి మాత్రమేకాదు గతంలో జరిగిన ఎన్నికలను కూడా బేరీజు వేసుకోవాలని డీఎంకే సభ్యులు వైద్యలింగం వ్యాఖ్యానించారు. శ్రీలంక యుద్ధం సమయంలో అధికారంలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్ తమిళులకు వ్యతిరేకంగా వ్యవహరించాయని వ్యాఖ్యానించడంతో మళ్లీ పోడియంవైపు దూసుకొచ్చారు.
అధికార విపక్షాల మధ్య రగడ సాగుతున్నా సభలోనే ఉన్న ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నోరుమెదపలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన డీఎంకే సభ్యులు సుమారు 15 నిమిషాలపాటూ సభలో నినాదాలు, కేకలతో బీభత్స వాతావరణం సృష్టించారు. డీఎంకే సభ్యుల వల్ల అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం ఏర్పడుతున్నందున వెలుపలకు పంపేయాలని స్పీకర్ ధనపాల్ మార్షల్స్‌ను ఆదేశించారు. అనంతరం బయటకు వచ్చిన స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, అటవీ కళాశాల విద్యార్థులు ఆమరణ దీక్ష చేస్తున్నారని, రవాణా ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారని చెప్పారు. ఈ అంశాలను ప్రస్తావించే అవకాశం ఇవ్వకపోవడంతో తాము సభను నిలదీయాల్సి వచ్చిందని చెప్పారు. గత సభలో ప్రవేశపెట్టిన 645 తీర్మానాల్లో ఒక్కటికూడా నోచుకోలేదని, ఈ సమావేశాల్లో సైతం ఆశలు లేవని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు విజయధారణి తదితరులు వాకౌట్ చేశారు.
శాసనసభ రసాభాస
Published Thu, Feb 19 2015 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement