► అసెంబ్లీ సమావేశాలకు కసరత్తులు పూర్తయ్యాయి.
► ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 29 వరకు సభ నిర్వహించేందుకు
► స్పీకర్ ధనపాల్ నిర్ణయించారు. తొలిరోజు సంతాప తీర్మానంతో
► సరి పెట్టి తదుపరి 18 రోజుల పాటు శాఖల వారీగా నిధుల
► కేటాయింపుల చర్చ సాగనుంది.
సాక్షి, చెన్నై : ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొక్కుబడిగా జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సీఎంగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత లేని దృష్ట్యా, ఆమె స్థానంలో భారంగా బాధ్యతను చేపట్టిన పన్నీరు సెల్వం నమా అనిపించేశారు. శాఖల వారీగా నిధుల కేటాయింపుల చర్చ కూడా సాగలేదు. ఎట్టకేలకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి నిర్దోషిగా బయట పడ్డ సీఎం జయలలిత, ఆర్కే నగర్ నుంచి మళ్లీ అసెంబ్లీ మెట్లు ఎక్కి సీఎం పగ్గాలు చేపట్టారు. ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టినానంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణ మీద దృష్టి పెట్టలేదు. పాలన మీద పట్టు సాధించే పనిలో పడ్డారని చెప్పవచ్చు. ప్రతి పక్షాల అసెంబ్లీని సమావేశ పరచాలని పదే పదే డిమాండ్ చేయడంతో పాటుగాప్రభుత్వంపై విమర్శలు గుప్పించే పనిలో పడ్డాయి. దీంతో అసెంబ్లీ తేదీని గవర్నర్ రోశయ్య ద్వారా గత వారం ప్రకటించారు.
18 రోజుల చర్చ : సభ తేదీ ఖరారు కావడంతో నిర్వహణా కసరత్తుల మీద స్పీకర్ ధనపాల్ దృష్టి సారించారు. శుక్రవారం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. స్పీకర్ ధనపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలు, శాఖల వారీగా నిధుల కేటాయింపుల సమీక్ష తేదీలను నిర్ణయించారు. ఆ మేరకు సభను ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 29 వరకు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. సెలవు దినాలు పోగా సభ 19 రోజుల పాటుగా సాగనున్నది. 24వ తేదీ తొలిరోజున ఇటీవల మరణించి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మాజీ మంత్రి, కడయనల్లూరు ఎమ్మెల్యే చెందూర్ పాండియన్, సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్‌లకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
వీరికి సంతాపం తెలియజేసినానంతరం సభ వాయిదా పడనున్నది. తదుపరి 25వ తేదీ నుంచి 18 రోజుల పాటుగా ఆయా శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చ సాగనున్నట్టు స్పీకర్ ధనపాల్ వివరించారు. ఆ మేరకు సెప్టెంబర్ 22వ తేదీ రాష్ట్ర హోం శాఖకు నిధుల కేటాయింపుపై చర్చ జరగనున్నదని తెలిపారు. అయితే, సభను 18 రోజులకు పరిమితం చేయడానికి ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో యాబై వరకు విభాగాలు, ముప్పై మంది వరకు శాఖలు ఉన్నప్పడు సమయాన్ని మాత్రం తక్కువగా కేటాయించి ఉండడాన్ని ఖండిస్తున్నారు. ఏదో మొక్కుబడిగా చర్చ సాగించేందుకే ప్రభుత్వం నిర్ణయించినట్టుందని మండి పడుతున్నారు. అయితే, ఈ సమయంలో ప్రతి పక్షాల్ని ధీటుగా ఎదుర్కొనడంతో పాటుగా, రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాకర్షణ నిర్ణయాలు నిధుల కేటాయింపుల్లో ఉండే అవకాశాలు ఉన్నట్టు సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి.
అసెంబ్లీకి సిద్ధం
Published Sat, Aug 22 2015 3:14 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM
Advertisement