నేటి నుంచి అసెంబ్లీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు 15 చట్టసభకు గత నెల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఓటర్లను నగదు పంచారనే ఆరోపణలతో కరూరు జిల్లా అరవకురిచ్చి, తంజావూరు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ వాయిదాపడగా, మొత్తం 234 స్థానాలకుగానూ 232 స్థానాలకు మాత్రమే పోలింగ్ నిర్వహించారు. తిరుప్పరగున్రం అన్నాడీఎంకే ఎమ్మెల్యే శీనివేల్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దీంతో 231 ఎమ్మెల్యేలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.
వీరిలో అన్నాడీఎంకే నుంచి 133 సభ్యులు, డీఎంకే నుంచి 98 సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. సీఎంగా జయలలిత బాధ్యతలు చేపట్టిన తరువాత గత నెల 25వ తేదీన ఒకసారి, ఈనెల 3వ తేదీన మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే తొలి సమావేశంలో సభ్యులచే ప్రమాణ స్వీకారం, రెండో సమావేశంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికతోనే సరిపెట్టి జూన్ 16వ తేదీన అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ప్రకటించారు.
ప్రజల సమస్యలు, కొత్త ప్రభుత్వం నుంచి ప్రకటన చోటుచేసుకోలేదు. ఈ కోణంలో చూస్తే ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇవే తొలి సమావేశాలుగా పరిగణనలోకి తీసుకోవచ్చు. అందుకే గవర్నర్ కే రోశయ్య కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశాలను వాయిదావేస్తున్నట్లు ప్రకటిస్తారు.
శుక్రవారం మళ్లీ సమావేశాలు కొనసాగుతాయి. సుమారు ఐదురోజుల పాటూ అసెంబ్లీ సమావేశాలు సాగుతాయని అంచనావేస్తున్నారు. ఈ ఐదు రోజుల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యులు ప్రసంగిస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో అన్నాడీఎంకే ఇచ్చిన హామీలను గ వర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే సీఎం జయలలిత చేసిన తొలి సంతకం ప్రకారం 500 టాస్మాక్ దుకాణాల మూతపై స్పష్టమైన ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.
అనేక ప్రత్యేకతల అసెంబ్లీ:
ఇదిలా ఉండగా, కొత్త అసెంబ్లీ అనేక ప్రత్యేకతలను, చారిత్రాత్మక ప్రాధాన్యతలను సంతరించుకుంది. గత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ ఈసారి ఓటమి పాలు కావడమేగాక, ఆ పార్టీ నుంచి ఒక్క అభ్యర్థి కూడా సభలో ప్రాతినిథ్యం వహించడం లేదు. రాష్ట్ర చరిత్రలో 89 మంది సభ్యులతో డీఎంకే బలమైన ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.
ప్రతిపక్ష నేతగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. అలాగే డీఎంకే మిత్రపక్ష కాంగ్రెస్ 8 స్థానాలు, ఇండియన్ ముస్లింలీగ్ ఒక్క స్థానంతో కొత్త అసెంబ్లీలోకి అడుగిడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో వామపక్షాలు లేని తొలి అసెంబ్లీగా మరో రికార్డును సొంతం చేసుకుంది.