► సీఈసీతో రాజేష్ లఖానీ సమావేశం
► అన్నాడీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీపై మరో పిటిషన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఉప ఎన్నికల పోరులో తలపడేందుకు డీఎంకే తన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అరవకురిచ్చి నుంచి కేసీ పళనిస్వామి, తంజావూరు నుంచి డాక్టర్ అంజుగం భూపతి, తిరుప్పరగున్రం నుంచి డాక్టర్ శరవణన్ పోటీపడుతున్నట్లు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి శుక్రవారం ప్రకటించారు.
ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తంజావూరు, అరవకురిచ్చి నియోజకవర్గాల్లో నగదు బట్వాడా సాగిందనే ఆరోపణలపై ఎన్నికలు రద్దయ్యాయి. అలాగే తిరుప్పరగున్రం నుంచి గెలిచిన అన్నాడీఎంకే అభ్యర్థి శీనివేల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిరోజుల్లో అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ మూడు స్థానాలకు ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశక్యత ఏర్పడింది.
ఇందుకు సంబంధించి ఇటీవలే ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. వచ్చే నెల 19వ తేదీన మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అన్నాడీఎంకే తన అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించి ఉండగా ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే తనపార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల నుంచి గురువారం దరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తు చేసుకున్న వారిని శుక్రవారం చెన్నైలోని డీఎంకే కేంద్ర కార్యాలయమైన అన్నాఅరివాలయానికి పిలిపించుకుని ఇంటర్వ్యూలు నిర్వహించింది. డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్, పార్టీ కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ఆశావహులను ఇంటర్వ్యూ చేశారు. ఆ తరువాత మూడు నియోజకవర్గాల్లో అరవకురిచ్చి నుంచి కేసీ పళనిస్వామి, తంజావూరు నుంచి డాక్టర్ అంజుగం భూపతి, తిరుప్పరగున్రం నుంచి డాక్టర్ శరవణన్ పోటీపడుతున్నట్లు పార్టీ అధ్యక్షులు కరుణానిధి అధికారికంగా ప్రకటించారు.
అన్నాడీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీపై మరో పిటిషన్:గత ఎన్నికల్లో నగదు పంపిణీ ఆరోపణలు ఎదుర్కొన్న సెంథిల్ బాలాజీని ఈ ఉప ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించాలని రాజేంద్రన్ అనే వ్యక్తి హైకోర్టులో ఇప్పటికే ఒక పిటిషన్ వేశారు. కాగా చెన్నై ట్రిప్లికేన్‌కు చెందిన భాస్కర్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో శుక్రవారం మరో పిటిషన్ వేశారు. రవాణాశాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనుచరులు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసగించినట్లుగా కేసు నమోదైందని ఆయన అన్నారు. 220 మంది నిరుద్యోగుల నుంచి రూ.4.25 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలపై హైకోర్టులో కేసు నడుస్తున్నందని ఆయన చెప్పారు.
ఇలాంటి అక్రమాల ఆరోపణలు కేసులు ఎదుర్కొంటున్న సెంథిల్ బాలాజీ అభ్యర్థిగా అనర్హుడిగా ప్రకటించాలని భాస్కరన్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ 25వ తేదీ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ శుక్రవారం ఢిల్లీకి చేరుకుని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్‌జైదీతో సమావేశం అయ్యారు. గడిచిన ఎన్నికల్లో వచ్చిన నగదు బట్వాడా ఆరోపణలు పునరావృతం కాకూడదని సూచించినట్లు సమాచారం. ఎన్నికలు నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తమిళిసై సౌందరరాజన్ కోరారు.
పుదుచ్చేరి సీఎం ప్రచారం:పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి శుక్రవారం తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీచేయకుండానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నారాయణస్వామి ఆరునెలల్లోగా ఏదేనీ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లితోప్పు నియోజకవర్గం అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం నారాయణస్వామి పేరును గురువారం అధికారికంగా ప్రకటించింది. దీంతో శుక్రవారం ఆయన పుదుచ్చేరిలోని తన నియోజకవర్గంలో ఇల్లిల్లూ తిరుగుతూ ప్రచారం చేశారు.
డీఎంకే అభ్యర్థులు వీరే
Published Sat, Oct 22 2016 2:37 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
Advertisement