
చెన్నై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ మంగళవారం ఉదయం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. మరో రెండు రోజుల్లో మద్రాస్ హైకోర్టులో బాలాజీ బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
న్యాయపరమైన చిక్కుల వల్లే బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్ 14న మనీలాండరింగ్ కేసులో బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అరెస్టు చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బాలాజీపై చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ కేసు నమోదు చేశారు.
ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ బాలాజీని అరెస్టు చేసింది. అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ బాలాజీని సీఎం స్టాలిన్ మంత్రివర్గంలోనే కొనసాగించారు. పోర్ట్‌ఫోలియో మాత్రం కేటాయించలేదు. అయితే దీనిపై హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలాజీని మంత్రి పదవిలో కొనసాగించే విషయమై మరోసారి ఆలోచించాలని సీఎం స్టాలిన్‌కు కోర్టు సూచించింది. దీంతో బెయిల్ పిటిషన్ రెండోసారి హైకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment