
పాల రచ్చ!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఆవిన్ పాల ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒకే సారి లీటరు పాలపై రూ.పది పెంచడాన్ని ప్రజలు, రాజకీయ పక్షాలు జీర్ణించుకోలేకున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ధరను తగ్గించడం లక్ష్యంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కదిలాయి. మంగళవారం డీఎండీకే నేతృత్వంలో నిరసన సాగగా, బుధవారం నుంచి ఆందోళనలు రాజుకున్నాయి. డీవైఎఫ్‌ఐ, ఐద్వాలతో పాటుగా పలు సంఘాల నేతృత్వంలో రాష్ట్రంలో ఆయా నగరాల్లో నిరసనలు చోటు చేసుకున్నాయి. పాల ధరను తగ్గించాల్సిందేనని నిరసన కారులు నినదించారు. చెన్నై సెంట్రల్ ఆవరణలో డీవైఎఫ్‌ఐ, ఐద్వా నేతృత్వంలో భారీ నిరసన జరిగింది.
ఉద్రిక్తత : నిరసనకారులు బుధవారం ఉదయాన్నే రోడ్డెక్కారు. పాల ధరను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శవయాత్ర నిర్వహించారు. సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎదురుగా పూందమల్లి హైరోడ్డులో బైఠాయించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. ఆందోళనకు తరలి వచ్చిన వారిలో అత్యధికంగా మహిళలు ఉండడంతో వారిని అడ్డుకోవడం పోలీసులకు శ్రమగా మారింది. చివరకు మిహ ళా పోలీసులు పెద్ద ఎత్తున రప్పించి వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో తోపులాట వాగ్యుద్ధం చోటు చేసుకుంది. కొందరు అయితే, రోడ్డుపై అడ్డంగా పడుకోవడం, మరి కొందరు వాహనాల చక్రాల కింద పడుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగడంతో పూందమల్లి హైరోడ్డు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కింది. చివరకు పెద్ద ఎత్తున బలగాల్ని రంగంలోకి దించి, నిరసనకారుల్ని అతి కష్టం మీద అరెస్టు చేశారు. ఈ నిరసనతో రెండు గంటల పాటుగా వాహన చోదకులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని క్రమ బద్ధీకరించేందుకు పోలీసులు చెమటోడ్చక తప్పలేదు. గురువారం నుంచి పాల ధర పెంపునకు నిరసనగా రోజుకో రాజకీయ పార్టీ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.