
రూ.500 కోట్లు..80 సీట్లు
డీఎండీకేకు డీఎంకే బేరమని వైగో వివాదాస్పద వ్యాఖ్యలు
వైగోకు కరుణానిధి నోటీసులు
బీజేపీ, డీఎండీకే ఖండన
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎన్నికల ప్రచార యుద్ధం మొదలు కాకముందే ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ప్రకంపనలు సృష్టించాడు. డీఎండీకేను తనవైపు తిప్పుకునేందుకు డీఎంకే రూ.500 కోట్లు, 80 సీట్లు ఆఫర్ చేసిందని ఆరోపణలు చేయడం కరుణానిధి శిబిరంలో కలకలం రేపింది. ఈ ఆరోపణలు తిప్పికొడుతూ వైగోపై కరుణానిధి కోర్టులో కేసు వేశారు.డీఎండీకేతో పొత్తుపెట్టుకునేందుకు డీఎంకే, బీజేపీలు తీవ్రస్థాయిలో ప్రయత్నించాయి. డీఎంకేలో చేరడం దాదాపు ఖాయమైనట్లు ప్రచారాలు సాగగా, కరుణానిధి సైతం ఈ ప్రచారాలను బలపరిచారు. అయితే ఆ తరువాత తమ పార్టీ ఒంటరిపోరుకు సిద్ధమైనట్లు విజయకాంత్ ప్రకటించారు.
విజయకాంత్ తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన తరువాత సైతం డీఎండీకే తమతో కలుస్తుందని కరుణానిధి ఆశాభావ ప్రకటనలు గుప్పించారు. ఇంతటి ఒత్తిడిని ఎదుర్కొన్న విజయకాంత్ అకస్మాత్తుగా వైగో నాయకత్వంలోని ప్రజాసంక్షేమ కూటమిలో చేరాడు. డీఎండీకే కోసం అంతగా ప్రయత్నించని సంక్షేమ కూటమిలో విజయకాంత్ రాకతో ఆనందాలు వెల్లివిరిశాయి. ఇదే అదనుగా ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో డీఎంకేను అప్రతిష్ట పాలుచేసే ప్రయత్నం చేశాడు. తమ కూటమిలో చేరితే రూ.500 కోట్లు, 80 సీట్లు ఇస్తామని విజయకాంత్‌తో డీఎంకే బేరసారాలు ఆడిందని వైగో ఎద్దేవా చేశాడు. అలాగే బీజేపీ సైతం కేంద్ర మంత్రివర్గంలో చోటు, రాజ్యసభకు సీటు ఇస్తామని ఆఫర్ చేసి విఫలమైందని వ్యాఖ్యానించాడు.
కరుణ ఆగ్రహం-వైగోకు నోటీసులు:
డీఎంకేపై వైగో నిరాధార ఆరోపణలు చేశాడని పార్టీ అధ్యక్షులు కరుణానిధి మండిపడ్డారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోకు కరుణానిధి తరఫున న్యాయవాది కే అళగురామన్ శనివారం నోటీసులు పంపారు. కరుణానిధి ప్రతిష్టకు కళంక ం తెచ్చేలా చేసిన వ్యాఖ్యలను ఏడు రోజుల్లోగా ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. లేకుండా సివిల్, క్రిమినల్ పరువునష్టం దావాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. వైగో వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేసిన అభాండాలు మాత్రమేనని డీఎంకే కోశాధికారి స్టాలిన్ అన్నారు.
డీఎండీకేతో తాము ఒక్కసారికూడా చర్చలు జరపలేదని, ఈ విషయాన్ని విజయకాంత్ సతీమణి ప్రేమలత స్పష్టం చేశారని తెలిపారు. వైగో ఆరోపణలపై కరుణానిధి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. వైగోకు పంపిన కేసులను ఉపసంహరించుకోవాలని కరుణానిధిని ప్రేమలత కోరారు. సీనియర్ నేతగా మీరు ఎన్నో కేసులను ఎదుర్కొన్నారు, అలాగే విజయకాంత్‌పై కూడా అనేక పరువునష్టం దావాలు ఉన్నాయని చెప్పారు. కోర్టు కేసులకు వైగో భయపడరు, ఎదుర్కొంటారని అన్నారు.
ఖండించిన బీజేపీ: డీఎంకే లాగానే బీజేపీ సైతం డీఎండీకేతో బేరసారాలు ఆడిందని వైగో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాజ్యసభ సీటు, కేంద్రమంత్రివర్గంలో చోటు ఇచ్చేలా బీజేపీ బేరం పెట్టిందన్న వైగో ఆరోపణలు సత్యదూరమని కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ అన్నారు. బేరం పెట్టాల్సిన అవసరం బీజేపీకి లేదు, విజయకాంత్ అంతటి పెద్దవాడు కాదని వైగో తెలుసుకోవాలని హితవుపలికారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సైతం తీవ్రస్థాయిలో ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం వైగో అవాకులు చవాకులు పేలరాదని అన్నారు. నేను సిద్ధం: వైగో కరుణానిధి ఇచ్చిన నోటీసులను చట్టపరంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వైగో ప్రకటించారు. వారిని కోర్టుకు రానీయండి అన్నారు. కరుణానిధి నోటీసులు ఇవ్వడం, కేసులు పెడతామని హెచ్చరించడాన్ని స్వాగతిస్తున్నానని వైగో వ్యాఖ్యానించారు.