డీఎండీకే అధినేత విజయకాంత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇన్నాళ్లూ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల తీరుతో కెప్టెన్ అవస్థలు పడ్డారు.
డీఎండీకే అధినేత విజయకాంత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇన్నాళ్లూ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల తీరుతో కెప్టెన్ అవస్థలు పడ్డారు. ప్రస్తుతం మహిళా నేతల వంతు వచ్చినట్లుంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పలు జిల్లాల మహిళా నాయకులు డుమ్మా కొట్టారు. దీపావళి షాపింగ్ బిజీ అంటూ వారు వివరణ పంపడం గమనార్హం.
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విజయకాంత్ కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఏళ్ల తరబడి మిత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు తిరుగుబావుటా ఎగుర వేశారు. వారి వెంట మరికొందరు నడవడం డీఎండీకేను బాగా దెబ్బతీసింది. అసెంబ్లీ నుంచి విజయకాం త్ సస్పెండ్ కావడం, కేసులు, ఆరుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్ కావడం వంటి ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. తాజాగా మహిళా నేతలు కెప్టెన్‌కు షాక్ ఇచ్చారు.
మహిళా విభాగం
డీఎండీకేలో పార్టీ పరంగా 59 జిల్లాలకు కార్యవర్గాలు ఉన్నాయి. పార్టీ అనుబంధ మహిళా, యువజన విభాగాలకు సైతం ఇదే పద్ధతిలో కార్యవర్గాలు నియమించారు. పార్టీలో మహిళా విభాగం తర్వాత యువజన విభాగం కీలకభూమిక పోషిస్తోందని చెప్పవచ్చు. మహిళా విభాగానికి ఒక జిల్లా కార్యదర్శి, నలుగురు సంయుక్త కార్యదర్శుల్ని నియమించారు. పార్టీ పరంగా ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ముందుగా మహిళా విభాగంతోనే విజయకాంత్ చర్చిస్తున్నారు. అ యితే ఈ విభాగం కార్యక్రమాలు విజయకాంత్ సతీ మణి పేమలత కనుసన్నల్లో సాగుతున్నాయి. ఈ విషయమైన మహిళా నేతలు అసంతృప్తిగా ఉన్నారు.
డుమ్మా
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహిళా విభాగం నేతృత్వంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు నేతలు ఆదివారం సమావేశమయ్యా రు. కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి అన్ని జిల్లాల్లోని మహిళా కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల్ని ఆహ్వానించారు. అయితే హాజై రెన వారు అంతంతమాత్రమే. కొన్ని జిల్లాల నుంచి కార్యదర్శలు వస్తే సంయుక్త కార్యదర్శులు డుమ్మా కొట్టారు. మూడు జిల్లాల నుంచి ఏ ఒక్కరూ హాజరుకాలేదు. వచ్చినవాళ్లతో సమావేశం జరిగిందనిపించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు.
వివరణ
కార్యవర్గ సమావేశానికి డుమ్మాకొట్టిన నేతల నుంచి వివరణ కోరుతూ మహిళా విభాగం తరపున లేఖలు వెళ్లాయి. అనివార్య కారణాలతో హాజరుకాలేక పోయామని కొందరు వివరణ ఇచ్చారు. దీపావళి షాపింగ్‌లో బిజీగా ఉండి రాలేకపోయామంటూ మూడు జిల్లాల నేతలు వివరణ పంపడం గమనార్హం. ఆదివారం సమావేశం పెడితే తమ పనుల్ని వదులుకుని ఎలా రాగలమని ఎదురుప్రశ్న వేశారు. అయితే ఈ చర్య మహిళా నేతల తిరుగుబాటుకు సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తిరుగుబాటు సంస్కృతిని మొగ్గలోనే తుంచేసే దిశగా కెప్టెన్ దృష్టి పెట్టారని మహిళా నేత ఒకరు తెలిపారు. గతంలో చేపట్టిన కార్యక్రమాల వివరాల్ని వీడియో, ఫొటో క్లిప్పింగ్‌లతో సహా నివేదిక రూపంలో కార్యవర్గ సమావేశానికి తీసుకురావాలంటూ వచ్చిన ఆదేశం వల్లే అనేక మంది డుమ్మా కొట్టినట్టు మరో నాయకురాలు పేర్కొన్నారు.