ఇంతకీ కార్పొరేషన్ మేయర్ ఏమయ్యారు? ఎక్కడకు వెళ్లారు? అని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రశ్నల వర్షం కురిపించారు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న అగ్రి కృష్ణమూర్తికి ఓ న్యాయం, తప్పును ఎత్తి చూపిన ట్రాఫిక్ రామస్వామికి మరో న్యాయమన్నట్లుగా వివక్ష చూపితే సహించబోమన్నారు. కార్పొరేషన్, ప్రభుత్వ తీరును ఎండగడుతూ స్టాలిన్ నేతృత్వంలో బుధవారం ఐనావరంలో భారీ నిరసన జరిగింది.
సాక్షి, చెన్నై: చెన్నై పరిధిలోని కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రాతిని థ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వారానికి ఓ మారు తన నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నా లు చేస్తున్నారు. అయితే, తన నియోజకవర్గానికి ఎమ్మె ల్యే నిధులతో కేటాయించిన పనులను ముందుకు తీసుకెళ్లడంలో కార్పొరేషన్ వర్గాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం మీద అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్టాలిన్ కొళత్తూరు ప్రజలతో కలసి భారీ నిరసనకు పిలుపు నిచ్చారు.
కొళత్తూరు నుంచి వేలాది మందితో భారీ ర్యాలీగా ఐనావరంలోని కార్పొరేషన్ మండల కార్యాలయం ముట్టడికి యత్నించారు. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ ప్రయత్నాన్ని వీడారు. గుంపులు గుంపులుగా వేలాది మంది ఐనావరం కార్యాలయం వద్దకు చేరుకుని ముట్టడికి యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ మార్గంలోనే బైఠాయించారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. మేయర్ ఎక్కడ? దోమల నుంచి రక్షించేదెవరు? డెంగీ, స్వైన్ ఫ్లూను కట్టడి చేయలేరా? మెట్రో పనులు సాగేనా...?అంటూ పాలకులను ప్రశ్నించారు.
మేయర్ ఎక్కడ: నిరసను ఉద్దేశించి స్టాలిన్ ప్రసంగిస్తూ, ఈ నిరసన కోసం పది రోజుల క్రితమే అనుమతి కోరామన్నారు. అయినా అనుమతి ఇవ్వకుండా ర్యాలీని అడ్డుకున్నారని, నిరసన సభను అడ్డుకునే యత్నం చేశారని మండి పడ్డారు. దీన్ని బట్టి చూస్తే అణగదొక్కే ప్రయత్నాలు ఏ మేరకు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని శివాలెత్తారు. నగరంలో ప్రజా సమస్యలు, పథకాలు, ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని, అయితే, మేయర్ పత్తా లేకుం డా పోవడం విచారకరమన్నారు. తాను మేయర్‌గా ఉన్నప్పుడు ప్రతి రోజు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో పర్యటించానని, అయితే, ఈ మేయర్ ఎక్కడున్నారో...అంతు చిక్కడం లేదని ఎద్దేవా చేశారు.
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఏ విధంగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చిందో, అదే బాటను మేయర్ కూడా అనుకరిస్తున్నట్టుందని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఒక ఎమ్మెల్యేగా తనకు కల్పించిన అన్ని హక్కుల్ని కాలరాస్తున్నారని మండి పడ్డారు. తన నిధులతో రూ. 6 కోట్ల మేరకు పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటే, ఇంత వరకు రూ.కోటి పనులు కూడా పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విల్లివాక్కం వంతెన కోసం తాను రాసిన లేఖకు కేంద్రం స్పందించి రూ.7 కోట్లను కేటాయించింద న్నారు. అయితే ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క వంతెనను, ఏ ఒక్క నిర్మాణాల్ని చేపట్టి దాఖలాలు లేవ ని విమర్శించారు. అసెంబ్లీలో జయలలిత 110 నిబంధనల మేరకు ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చి చివరకు ప్రజలకు ‘111’ పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశా రు.
అగ్రి కృష్ణమూర్తి హత్యారోపణలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేస్తూ, ఆయన మీద ఇంత వరకు ఏ ఒక్క కేసు పెట్టక పోవడం శోచనీయమని విమర్శించారు. అగ్రి విషయంలో మెతక వైఖరి అనుసరిస్తూ, తప్పును ఎత్తి చూపిన ట్రాఫిక్ రామస్వామిని మాత్రం జైల్లో పెట్టి చిత్ర హింసలకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాళ్లకు ఓ న్యాయం... మరొకరికి మరో న్యాయం అన్నట్టుగా ఈ పాలకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పాలకులకు చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందని, ప్రజలందరూ ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ నిరసనలో డీఎంకే నాయకులు శేఖర్ బాబు, రంగనాథన్, గిరి రాజన్, ఐసీఎఫ్ మురళి పాల్గొన్నారు.
ఏమిటీ వివక్ష?
Published Thu, Mar 19 2015 12:13 AM | Last Updated on Fri, Sep 28 2018 7:30 PM
Advertisement
Advertisement