లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి నడిచే పార్టీలకు, సొంత పార్టీ నేతలకు నియోజకవర్గాల కేటాయింపు పనులకు ఎన్నికల బృందం ఏర్పాటైంది.
స్టాలిన్ సహా ఐదుగురు సభ్యులు
సీట్ల కేటాయింపుపై త్వరలో చర్చలు
15న తిరుచ్చిలో పార్టీ మహానాడు
చెన్నై, సాక్షి ప్రతినిధి:లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి నడిచే పార్టీలకు, సొంత పార్టీ నేతలకు నియోజకవర్గాల కేటాయింపు పనులకు ఎన్నికల బృందం ఏర్పాటైంది. డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ శుక్రవారం ఎన్నికల బృందంలోని సభ్యుల పేర్లను ప్రకటించారు. రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించే వ్యవహారానికి డీఎంకే సిద్ధమైంది. పొత్తుపెట్టుకున్న పార్టీలతో సుహృద్భావ వాతావరణంలో ముందుగా చర్చలు జరిపి అనంతరం సొంతపార్టీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఎన్నికల వేళ ఇటువంటి కీలకమైన బాధ్యతల భారాన్ని ప్రధానంగా ఐదుగురిపై పార్టీ మోపింది. డీఎంకే కోశాధికారి, కరుణ తనయుడు స్టాలిన్, సహాయ ప్రధాన కార్యదర్శులు దురైమురుగన్, వీపీ దురైస్వామి, న్యాయవిభాగం కార్యదర్శి పీఎస్ భారతి, పార్టీ నిర్వాహక కార్యదర్శి పీవీ కల్యాణ సుందరం ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు మరో కమిటీ సిద్ధమైంది. డీఎంకే పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ టీఆర్ బాలుతోపాటూ పార్లమెంటు సభ్యులు కనిమొళి, ఏ రాజా, పార్టీ సహాయ ప్రధాన కార్యదర్శి సద్గుణ పాండియన్, నిర్వాహక కార్యదర్శి టీకేఎస్ ఇళంగోవన్‌లపై కరుణ మేనిఫెస్టో బాధ్యతలను కేటారుుంచారు.
15న తిరుచ్చిలో పార్టీ మహానాడు
డీఎంకే 10వ మహానాడును ఈనెల 15, 16వ తేదీల్లో తిరుచ్చిరాపల్లిలో నిర్వహిస్తున్నారు. 200 ఎకరాల్లో సభను ఏర్పాటు చేసి 10 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహానాడు విజయవంతానికి రెండు వేల యువ, మహిళా వలంటీర్లను సిద్దం చేశారు. డీఎంకే అధినేత కరుణానిధి మహానాడుకు హాజరై కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు. గత 9 మహానాడుల కంటే భారీగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.