నిద్రావస్థలో సర్కార్
- కరువు నివారణ చర్యలేవీ?
- ఎమ్మెల్యే కాశప్పను అరెస్ట్ చేయాలి
- బీజేపీలో డబ్బు తీసుకునే సంస్కృతి లేదు
- కుమారస్వామి జేడీఎస్ గురించి ఆలోచిస్తే మంచిది
- రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి
సాక్షి, బళ్లారి : రాష్ట్రంలో తీవ్ర కరువు ఛాయలు ఏర్పడినా నివారణ చర్యలు తీసుకోవడంలో సిద్ధు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి విమర్శించారు. నగరంలో బీజేపీ స్లం మోర్చా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్దరామయ్య హావభావాలు, చేస్తున్న వ్యాఖ్యలను బట్టి ఆయన ఐదేళ్లు పదవిలో కొనసాగుతారనే నమ్మకం ఆయనకే లేదని స్పష్టమవుతోందని అన్నారు.
రాష్ట్ర మంత్రులు మహాదేవ ప్రసాద్, అంబరీష్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా పోలీసులపై దాడి చేసిన ఎమ్మెల్యే కాశప్పను ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఒక చట్టం,సామాన్యులకు మరొక చట్టం ఉంటుందా? అని ప్రశ్నించారు.
విధాన పరిషత్, రాజ్యసభ సభ్యులుగా బీజేపీ బలోపేతానికి పని చేసిన వారిని ఎంపిక చేశామని, డబ్బు తీసుకుని పదవులు ఇచ్చే సంస్కృతి బీజేపీలో లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బీజేపీపై ఆరోపణలు చేసేముందు ఎమ్మెల్సీ ఎంపికపై సొంత పార్టీ నాయకులే ఏమంటున్నారో తెలుసుకోవాలని హితవు పలికారు.