షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్, మాడా లోక్‌సభ నియోజక వర్గాల ముఖచిత్రం స్పష్టమైంది. షోలాపూర్ స్థానంలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అభ్యర్థి సుశీల్ కుమార్ షిండే, అడ్వొకేట్ శరద్ బన్సోడే మధ్య పోటీ జరగనుంది. అలాగే మాడా స్థానంలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి తరఫున బరిలోకి దిగిన మాజీ ఉపముఖ్య మంత్రి విజయసింహ మోహితే పాటిల్, మహాకూటమి అభ్యర్థి సదాబహు ఖోత్, స్వతంత్ర అభ్యర్ధి ప్రతాప్ సింహ మోహితే పాటిల్‌లు పోటీ పడుతున్నారు. షోలాపూర్ స్థానం నుంచి సుశీల్‌కుమార్ షిండే నాలుగోసారి బరిలోకి దిగారు. గతంలో 1998, 1999, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేశారు.
2009 నాటి ఎన్నికల్లో కాషాయ కూటమికి చెందిన బీజేపీ అభ్యర్ది అడ్వకేట్ శరద్ బన్సోడేతోనే ఆయన తలపడ్డారు. ఆనాటి ఎన్నికల్లో షిండేకి 3 లక్షల 87 వేల 592, బన్సోడేకి 2 లక్షల 87 వేల 457 ఓట్లు వచ్చాయి. దీంతో షిండేకి 99 వేల 652 ఓట్ల మేర మెజారిటీ వచ్చింది. ఈసారికూడా షిండే, బన్సోడేలే బరిలో నిలిచారు. కాగా సుశీల్ కుమార్‌ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఆయన ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే ఒక పర్యాయం నియోజకవర్గాన్ని చుట్టేశారు కూడా. మిత్రపక్షమైన ఎన్సీపీ కూడా ఆయనకు అన్నివిధాలుగా సహకరిస్తోంది. మరోవైపు ఇక్కడి నుంచి బరిలోకి దిగిన శరద్ నామినేషన్ దాఖలు తర్వాత ప్రచారం జోరు పెంచారు. వాస్తవానికి ఆయనకు ఇప్పటిదాకా బీజేపీకి చెందిన అసంతృప్తులను బుజ్జగించడానికే సమయమంతా గడిచిపోయింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన లలిత్ బాయిర్ ముంబై నివాసి. అందువల్ల షోలాపూర్ స్థానం ఓటర్లు ఆయనను ఏ మేర ఆదరిస్తారనే విషయం ప్రశ్నార్ధకంగానే వుంది. పట్టణంలో అప్ కార్యకర్తల సంఖ్య అంతంతే.
ఇక మాడా నియోజకవర్గంలో ఎన్సీపీకి చెందిన విజయసింహ మోహితే పాటిల్, మహాకూటమి తరపున సదాబాహు ఖోత్, స్వత్రంత్ర అభ్యర్థి ప్రతాప్ సింహ మోహితే పాటిల్‌ల మధ్యనే పోటీ నెలకొంది. విజయసింహ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన పార్టీలో సగానికి పైగా నాయకులను బుజ్జగించడంలో సఫలమైనప్పటికీ సంజయ్‌షిండే, మణ సెగ్మెంట్ ఎమ్మెల్యే జయకుమార్ తటస్థంగా ఉండడం, స్వయానా సోదరుడు ప్రతాప్‌సింహ మోహితే పాటిల్ స్వతంత్ర అభ్యర్దిగా ఎన్నికల బరిలో నిలవడం లాంటివి విజయ్‌సింహకు మరీ తలనొప్పిగా మారింది.
ఇదిలాఉంచితే మహాకూటమికి చెందిన సదాబహు ఖోత్ ైరె తుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అలాగే ప్రతాప్‌సింహ మాడా... లోక్‌సభ నియోజక వర్గం పరిధిలో అభివృద్ధిని ఏకరువు పెడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ స్థానంలో ఆప్ తరపున అడ్వొకేట్ సవితా షిండే బరిలో ఉన్నారు. ఆమెకు ఎన్ని ఓట్లు లభిస్తాయేది వేచిచూడాల్సిందే.
షోలాపూర్ లోక్‌సభ నియోజక వర్గంలో 2009 నాటి ఎన్నికల్లో మొత్తం 13 అభ్యర్థులు పోటీపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జాతీయ పార్టీల తరఫున ముగ్గురితోపాటు 10 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా ఈ స్థానంలో పోటీ చేస్తున్నారు. మాడా లోక్ సభ నియోజక వర్గంలో 2009 నాటి ఎన్నికల్లో 15 మంది అభ్యర్దులు పోటీపడగా ఈసారి 24 అభ్యర్దులు బరిలో ఉన్నారు. జాతీయ రాజకీయ పార్టీలకు సంబంధించి ఇరువురు, అలాగే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఐదుగురు అభ్యర్థులతోపాటు 17 మంది స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.
ఈ రెండు నియోజక వర్గాలలో నలుగురు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. షోలాపూర్ స్థానంలో సునీత ఉగడే, మాడా స్థానంలో అప్‌కి చెందిన సవితా షిండే, స్వతంత్ర అభ్యర్ధి నాగమణి జక్కన్, సుజాతా తుపు సౌందర్యలు ఇక్కడ బరిలో ఉన్నారు. విశేషమేమిటంటే తెలుగు మహిళ అయిన నాగమణి జక్కన్ 2004లో ఇక్కడినుంచి పోటీ చేశారు. 2009 లో ఆమె మాడా స్థానం నుండి ఎన్నికల బరిలో దిగారు. ఆమెకు 2,799 ఓట్లు లభించాయి. ఆమె మళ్లీ ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నారు.
షోలాపూర్‌లో ద్విముఖ పోటీ
Published Wed, Apr 2 2014 10:57 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement