సీబీఐ గుప్పెట్లోకి..
సాక్షి, చెన్నై: నామక్కల్ జిల్లా తిరుచంగోడు డీఎస్పీ విష్ణు ప్రియ అనుమానాస్పద మృతి కేసు సీబీఐ గుప్పెట్లోకి చేరింది. కేసు ఛేదింపులో సీబీసీఐడీ విఫలం కావడంతో కేసును సీబీఐకు అప్పగిస్తూ మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సేలం, నామక్కల్, ధర్మపురి, కృష్ణగిరి, తిరుప్పూర్ తదితర ఉత్తర, దక్షిణ తమిళనాడుల్లో కులాంతర ప్రేమ, ప్రేమ వివాహాలు వివాదానికి దారి తీస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ప్రేమికులు విగతజీవులు అవుతున్నారు. మరికొన్ని చోట్ల పరువు హత్యలు చోటు చేసుకుంటున్నాయి.
ఇంకొన్ని చోట్ల ప్రియుడు అనుమానాస్పద స్థితిలో హత్యలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనే నామక్కల్ జిల్లా తిరుచంగోడు పోలీసు డివిజన్ పరిధిలో గత ఏడాది చోటు చేసుకున్నది. గోకుల్ రాజ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి రాష్ర్ట వ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఆత్మహత్యగా భావించినా, చివరకు కులాంతర ప్రేమ వ్యవహారం బయటకు రావడంతో కేసు విచారణ పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసును విచారిస్తూ వచ్చిన డీఎస్పీ విష్ణు ప్రియ అనుమానాస్పద స్థితిలో మరణించడం వివాదానికి దారి తీసింది.
అయితే, గోకుల్ రాజ్ హత్య కేసు విచారణలోని ఒత్తిళ్లు ఆమె ఆత్మహత్యకు దారి తీసినట్టు ఆరోపణలు బయలు దేరాయి. అదే సమయంలో ఈ బలవన్మరణం వెనుక ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, వేదింపులు ఉన్నట్టుగా ప్రచారం బయలు దేరింది. దీంతో ఆమె మృతి కేసు మిస్టరీగానే మారింది. గోకుల్‌రాజ్ హత్యకేసులో పట్టుబడ్డ ధీరన్ చిన్నమలై పేరవై నిర్వాహకుడు యువరాజ్ విష్ణుప్రియ మరణం వెనుక గల కారణాలు, పోలీసు అధికారులు, రాజకీయ ఒత్తిళ్లను వివరిస్తూ ఆరోపణలు గుప్పించారు. దీంతో కేసు విచారణ సీబీసీఐడీకి చేరింది.
పది నెలలుగా సీబిసీఐడీ సాగించిన విచారణలో మరణం వెనుక మిస్టరీని ఛేదించలేని పరిస్థితి.అదే సమయంలో విష్ణు ప్రియ కుటుంబం హైకోర్టులో సిబిఐ విచారణకు విన్నవించగా, న్యాయమూర్తి సుబ్బయ్య నేతృత్వంలోని సింగిల్ బెంచ్ తొలుత తిరస్కరించింది. తదుపరి అప్పీలుకు వెళ్లగా, కేసు విచారణ న్యాయమూర్తులు రమేష్, మురళీధరన్ నేతృత్వంలోని బెంచ్ ముందు సాగుతూ వచ్చింది. కేసు ఛేదింపులో సీబీసీఐడీ విఫలం కావడంతో, ఇక, వారి ద్వారా ఒరిగిందిశూన్యమేనన్నది కోర్టులో తేలింది. దీంతో విష్ణుప్రియ కుటుంబీకుల విజ్ఞప్తి మేరకు కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ మద్రాసు హైకోర్టు బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.