శేఖర్‌రెడ్డిపై మరో రెండు కేసులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి, అతని అనుచరులపై సీబీఐ మంగళవారం మరో రెండు కేసులు నమోదు చేసింది. శేఖర్‌రెడ్డి అతని భాగస్వాముల ఇళ్లు, ఆస్తులపై గత నెల 8వ తేదీన ఆదాయపుపన్నుశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి రూ.131 కోట్ల నగదు, ఇందులో రూ.34 కోట్ల కొత్త కరెన్సీ, 127 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు తీవ్రత దృష్ట్యా విచారణ బాధ్యత సీబీఐ, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ చేతుల్లోకి వెళ్లింది. ఈ కేసులో శేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, అన్నాడీఎంకే నేత దిండుగల్లు రత్నం, పుదుక్కోట్టై రామచంద్రన్ లను అరెస్ట్ చేశారు. శేఖర్‌రెడ్డి, శ్రీనివాసులుల జ్యుడిషియల్ కస్టడీ బుధవారంతో ముగియనుంది.
వేలూరులో రూ.8 కోట్ల కొత్త నోట్లు, తిరుచ్చిరాపల్లిలో రూ.1.5 కోట్లు దాచి ఉంచారనే ఆరోపణలతో శేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రేమ్‌రెడ్డి లపై సీబీఐ అధికారులు తాజాగా మరో రెండు కేసులు నమోదు చేసి మంగళవారం మళ్లీ అరెస్ట్ చేశారు. మంగళవారం గట్టి బందోబస్తు మధ్య ఆ ముగ్గురిని పుళల్ జైలు నుంచి చెన్నై జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని.. బ్యాంకు మోసం కేసుల ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వెంకటస్వామి సమక్షంలో విచారణ జరిగింది. ఒకే రకమైన ఆరోపణలపై రెండోసారి అరెస్ట్ చేయవచ్చా అనే సందిగ్ధంలో తేదీ ప్రకటించకుండా కేసును వాయిదా వేశారు.