శేఖర్ రెడ్డి అరెస్ట్
• శ్రీనివాసరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న సీబీఐ
• కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు
• వీరితో బ్యాంకర్లు, ప్రభుత్వోద్యోగులు కుమ్మక్కైనట్లు ఆరోపణ
సాక్షి ప్రతినిధి, చెన్నై/ న్యూఢిల్లీ: టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు జె.శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుడు కె.శ్రీనివాస రెడ్డిలను సీబీఐ అధికారులు బుధవారం చెన్నైలో అరెస్ట్ చేశారు. చెన్నై ఎగ్మూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా జనవరి 3వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో వారిని పుళల్ జైలుకు తరలించారు. పెద్ద నోట్లు రద్దు తర్వాత ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ) అధికారులు జరిపిన సోదాల్లో శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల ఇళ్లలో రూ. 170 కోట్ల నగదు, 127 కిలోల బంగారం దొరికిన సంగతి తెలిసిందే. దీనిపై శేఖర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, ప్రేమ్ కుమార్‌లపై నేరపూర్వక కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఐటీ దాడుల్లో నిందితుల నుంచి రూ. 170 కోట్లు దొరియాయని, వాటిలో రూ. 34 కోట్ల విలువైన కొత్త రూ. 2,000 నోట్లు ఉన్నాయని సీబీఐ అధికారులు మీడియాకు చెప్పారు. పాత పెద్ద నోట్లను కొత్త నోట్లుగా మార్చుకునేందుకు వివిధ బ్యాంకులకు చెందిన గుర్తు తెలియని ఉన్నతాధికారులు నిందితులకు సహకరించారని పేర్కొన్నారు. పలువురు బ్యాంకు అధికారులు ఆర్బీఐ మార్గదర్శకాలకు తూట్లుపొడుస్తూ ‘ప్రతిఫలం’ ఆశించి నిందితులకు కొత్త నోట్లు అందజేశారని వివరించారు. ఈ ముగ్గురు నిందితులు.. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కుమ్మక్కై లెక్కలో లేని పాత నోట్ల (నల్లధనం)ను కొత్త నోట్లుగా మార్చి భారత ప్రభుత్వాన్ని మోసం చేశారన్నారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పి. రామ్మోహన్‌రావు కుమారుడితో శేఖర్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించారు.