
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
దసరా ఉత్సవాలకు సర్వంసిద్ధం చేశామని దుర్గగుడి ఈవో సూర్యకుమారి తెలిపారు.
దసరా ఉత్సవాలపై ఈవో సూర్యకుమారి
సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాలకు సర్వంసిద్ధం చేశామని దుర్గగుడి ఈవో సూర్యకుమారి తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, లడ్డూ ప్రసాదాలు, అన్నదానం, కేశఖండన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
వినాయకుడు గుడి నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా నాలుగు క్యూలైన్ల ఉంటాయని, రెండు లైన్లలో ఉచిత దర్శనం, ఒక లైన్‌లో రూ.100 టికెట్ దర్శనం, మరో లైన్‌లో ఓం టర్నింగ్ నుంచి రూ.300 లైన్ అనుమతిస్తామని చెప్పారు. మల్లికార్జున మహామండపంలో 10 లడ్డూ పులిహోర కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద కూడా ప్రసాదాలు విక్రయిస్తామని వివరించారు.
క్యూలైన్లలో భక్తులు తాగేందుకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. కొండ కింద భాగంలో అన్నప్రసాదం జరుగుతుందని తెలిపారు. కేశఖండన శాలలను సీతమ్మవారి పాదాలు వద్ద ఘాట్లలో ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. గోశాల వెనుకభాగంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.
విజయదశమి రోజున భవానీ భక్తులు అమ్మవారి సమర్పించే భవానీ బంధనాలు అర్జునవీధి చివరన గురుభవానీ సమక్షంలో తీయవచ్చన్నారు. లక్షకుంకుమార్చన మల్లికార్జున మహామండపంలోని ఆరో అంతస్తులో జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో దేవస్థానం ఏఈవో అచ్యుతరామయ్య, ప్రధాన అర్చకుడు లింగభొట్ల దుర్గాప్రసాద్, స్థానాచార్య విష్ణుభొట్ల శివప్రసాద్ పాల్గొన్నారు.