పింప్రి, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన దురంతో ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం 7.30 గంటలకు పుణేలోని ఉరిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రోజువారీ కూలీలు మరణించగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అందిన వివరాల మేరకు.. ఈ రైలు ముంబైలోని లోకమాన్యతిలక్ టర్మినల్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే ఉరిలి-యావత్ రైల్వే స్టేషన్ల మధ్య సిగ్నల్ రాకపోవడంతో గార్డు గేట్ వేయలేదు. అయితే రెండు ట్రాలీలను జోడించిన ట్రాక్టర్ గేటు దాటుతుండగా ప్రమాదం సంభవించింది. మొదటి ట్రాలీ సురక్షితంగా బయటపడినప్పటికీ రెండవ ట్రాలీ పట్టాలు దాటుతుండగా దూసుకు వచ్చిన ఈ రైలు ఢీకొట్టింది.
దీంతో ఈ ట్రాలీ వంద అడుగుల దూరంలో ఎగిసి పడింది. ఇందులో ప్రయాణిస్తున్న రోజువారీ కూలీలు అహ్మద్‌నగర్‌లోని తాంబేవాడికి చెందిన కాభారీ విఠోబా మహ్మవర్ (50), ఇందుభాయి భాగీనాథ్ హండాలే (45), పాతర్డికి చెందిన తాయినాందేవ్ భరడే ఘటనాస్థలంలోనే మరణించారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ చెరకు కోసేందుకు ట్రాలీల్లో కోయడనాకి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే సిగ్నల్ పడకపోవడంతో గేట్ వేయని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
ఈ దుర్ఘటన గురించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తర్వాత దురంతో ఎక్స్‌ప్రెస్ ముందుకు సాగింది. అయితే అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి హానీ జరగలేదు.
ఉరిలి వద్ద రైలు ప్రమాదం
Published Sat, May 3 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM
Advertisement
Advertisement