వంద శాతం ఓటింగ్‌లో పాల్గొనాలని కోరుతూ ప్రచారం నిర్వహించడానికి వచ్చిన కలెక్టర్‌కు ఉపాధి హమీ కూలీలు వేసిన ప్రశ్నతో ఖంగుతిన్నారు.
తిరువళ్లూరు: వంద శాతం ఓటింగ్‌లో పాల్గొనాలని కోరుతూ ప్రచారం నిర్వహించడానికి వచ్చిన కలెక్టర్‌కు ఉపాధి హమీ కూలీలు వేసిన ప్రశ్నతో ఖంగుతిన్నారు. తిరువళ్లూరు జిల్లా అధిగత్తూరు గ్రామంలో వంద శాతం ఓటింగ్ కోసం కలెక్టర్ సుందరవల్లి ర్యాలీ నిర్వహించారు. అందులోభాగంగా ఆమె ఇంటింటికి వెళ్లి అందుకు సంబంధించిన స్టిక్కర్‌లను అతికించారు. ఇదే సమయంలో ఉపాధి హమీ పనులు చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి వారికి కలెక్టర్ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఓటుకు నోటు తీసుకోవడం నేరం, ఓటు వేయడం ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కు అంటూ వారికి తెలిపారు. మీరు ఖచ్చితంగా ఓటు వేయాలంటూ చెబుతున్న సమయంలో ఓ మహిళా కూలీ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓటు వేస్తాం సరే... ఎవరికి వేయమంటారు మీరే చెప్పండి... ప్రస్తుతం పోటీ చేస్తున్న వారిలో ఎవరు మంచి అభ్యర్థి చెప్పాలంటూ కలెక్టర్ ను మహిళా కూలీ ప్రశ్నించింది. దీంతో కలెక్టర్ ఖంగుతిన్నారు. ఓటు ఎవరికి వేయాలనీ అడిగి... తనను వివాదాల్లోకి లాగ వద్దని వారికి సూచించారు. మీకెవరికి ఇష్టం ఉంటే వారికి ఓటు వేయండంటూ అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు. కలెక్టర్‌కు ఉపాధి హమీ పనులు చేస్తున్న మహిళల నుంచి ఊహించని ప్రశ్న ఎదురు కావడంతో కొంతసేపు నవ్వులు విరిశాయి.