సాక్షి, బెంగళూరు : పౌరసేవలకు సంబంధించి సమాచార, సాంకేతిక రంగాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వం ప్రజలకు మరో సేవను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే ఆస్తి ఉన్న ప్రాంతంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఏ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులోనైనా సదరు ఆస్తిని ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌కు నిపుణులు తుదిమెరుగులు దిద్దుతున్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను అనుసరించి ఇల్లు, ఇంటి స్థలం, పొలం తదితర స్థిరాస్తులు ఏ ప్రాతంలో ఉంటే ఆ ప్రాంతానికి చెందిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనే క్రయ, విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేయించాల్సి ఉంటుంది. దీని వల్ల స్థిరాస్తులకు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పని ఒత్తిడి ఎక్కువవుతోంది. అంతేకాకుండా అదే ప్రాంతంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించాలనే నిబంధనను అలుసుగా చేసుకుని ప్రభుత్వ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనేది బహిరంగ రహస్యం.
వీటినన్నింటికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కొన్న ఆస్తులనైనా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని సబ్‌రిజిస్టార్ కార్యాలయంలోనైనా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకునేలా కొత్త విధానాన్ని రూపొందించాలని నిర్ణయించింది. బెంగళూరు పరిధిలోని బసవనగుడి, గాంధీనగర్, జయనగర్, రాజాజీనగర్, శివాజీనగర్ ప్రాంతాల్లోని 43 సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత ఏడాది పెలైట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలు చేసి.. మంచి ఫలితం సాధించింది. దీంతో ఈ విధానాన్ని రాష్ట్రంలోని 203 సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు అవసరమైన సాఫ్‌వేర్‌ను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అభివృద్ధి పరిచింది. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించిన అధికారులు కొన్ని చిన్నచిన్న మార్పులు చేయమని సదరు కంపెనీకు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ విధానం అమల్లోకి రావడం వల్ల తమ వ్యక్తిగత ఆదాయం పడిపోతుందని భావిస్తున్న కొంతమంది ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారులు, రాజకీయ పెద్దలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ విధానం రాష్ట్రమంతటా అమలు కాకుండా చేయాలని ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ నడుపుతున్నట్లు సమాచారం.
ఈ విషయమై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉన్నత స్థాయి అధికారి ఒకరు మాట్లాడుతూ...‘ ఈ నూతన విధానం కోసం ఇప్పటికే రూ.147 కోట్లను ఖర్చు చేశాం. ఈ విధానం వల్ల శాఖలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్టపడబోతోంది. ఈ విధానం అమల్లోకి రాకుండా చేయాలని ఒత్తిళ్లు వస్తున్న మాట వాస్తవమే. అయినా త్వరలోనే ‘ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్’ ప్రక్రియను రాష్ట్రమంతటా ప్రవేశపెట్టితీరుతాం.’ అని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ ఈజీ
Published Thu, Oct 3 2013 4:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement