మంతనాల్లో దినకరన్
► జిల్లాల వారీగా సమాలోచన
► కేడర్ చేజారకుండా జాగ్రత్తలు
పార్టీ మీద పట్టు బిగించే పనిలో ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ నిమగ్నమయ్యారు. జిల్లాల వారీగా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంతనాల్లో మునిగారు. శనివారం వేలూరు, విల్లుపురం జిల్లాల్లో పార్టీపరిస్థితిపై సమాలోచించారు. కేడర్ చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ జైల్లో ఉండడంతో పార్టీ మీద పట్టు సాధించే పనిలో ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వేగం పెంచారు. చిన్నమ్మ ఆదేశాలను ఆచరణలో పెట్టే రీతిలో ముఖ్య నేతలు చేజారకుండా, నిత్యం ఏదో ఒక సమావేశంతో ముందుకు సాగే పనిలోపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై సమాలోచనకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం విల్లుపురం, వేలూరు జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఆ జిల్లాల్లోని మాజీ మంత్రులను సైతం పిలిపించి పార్టీ పరిస్థితిపై సమావేశం కావడం గమనార్హం. వచ్చిన నేతలు, మంత్రులు టీటీవీ దినకరన్ ముందు వినయాన్ని ప్రదర్శించడం ఆలోచించాలి్సందే. ఇందులో మంత్రులు కూడా ఉండడం గమనార్హం.
ప్రధానంగా పార్టీ కేడర్ చేజారకుండా, ఆయా జిల్లాల్లో మాజీ సీఎం పన్నీరు శిబిరం వైపుగా ఉన్న స్థానిక నాయకులు వివరాలను ఈసందర్భంగా టీటీవీ సేకరించినట్టు సమాచారం. జిల్లాల వారీగా సమీక్ష కేవలం తమకు ఉన్న అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకే టీటీవీ సాగిస్తున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పన్నీరు శిబిరంతో సంప్రదింపుల్లో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడడంతోనే, ఆయా జిల్లాల్లోని నేతల్ని ముందస్తుగా పిలిపించి మాట్లాడే పనిలో దినకరన్ ఉన్నారని చెబుతున్నారు.
తన దృష్టికి వచ్చిన జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల మీద నిఘా పెంచేందుకు స్థానికంగా ఉన్న నాయకులకు టీటీవి ఆదేశాలు సైతం ఇచ్చినట్టు సమాచారం. అలాగే, ఎన్నికల కమిషన్ కు చిన్నమ్మ శశికళ వివరణ ఇవ్వాల్సి ఉండడంతో, ఈ విషయంగా పరప్పన అగ్రహార చెరకు వెళ్లి ఆమెతో భేటికి టీటీవీ కసరత్తుల్లో ఉన్నట్టు అన్నాడిఎంకే కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసందర్భంగా ఆయా జిల్లాల్లోని పార్టీ వివరాలను చిన్నమ్మ దృష్టికి తీసుకెళ్లి, ఆమె సలహాల్ని పాటించేందుకు టీటీవీ కసరత్తుల్లో ఉన్నట్టు చెబుతున్నారు.