బ్యాంకు ఖాతాలపై నిఘా | Election Commission bank accounts Surveillance | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతాలపై నిఘా

Published Thu, Mar 13 2014 1:47 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు, వారి సంబంధీకుల బ్యాంకు ఖాతాలపై నిఘాపెట్టినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్ తెలి పారు.

చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు, వారి సంబంధీకుల బ్యాంకు ఖాతాలపై నిఘాపెట్టినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్ తెలి పారు. రూ.లక్ష పైచిలుకు నగదును బ్యాంకులో జమ చేసినా, డ్రా చేసిన ఎన్నికల కమిషన్‌కు లెక్క చెప్పాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్నెట్‌లోని సోషల్ నెట్‌వర్క్ ద్వారా ప్రచారం చేసినందున వివరణ కోరుతూ అన్నాడీఎంకేకు నోటీసు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.చెన్నై సచివాలయం లోని ఎన్నికల కార్యాలయంలో బుధవారం ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో నోటుతో ఓటు సాధించేందుకు అభ్యర్థులు చేసే ప్రయత్నాలనుఅడ్డుకుంటామని అన్నారు. ఓటర్ల జాబితాలో పేరులేదని, అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించలేదని తదితర ఫిర్యాదులు ప్రతిరోజు 300 పైచిలుకు అందుతున్నాయని చెప్పారు. 
 
 ఈసీ ద్యారా ఓటర్లకు స్లిప్పులు అందజేస్తామని, పార్టీ నుంచి కూడా తీసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే పోలింగ్‌బూత్‌లకు వెళ్లేపుడు పార్టీ చిహ్నాలను స్లిప్పుల నుంచి తొలగించాలని చెప్పారు. టోకన్ల ద్వారా వస్తువుల కొనుగోలు, హోల్‌సేల్‌గా వస్తువుల కొనుగోలును అనుమానిస్తున్నట్లు తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఈ నెల 9వ తేదీన ఒక్క రోజు ఇచ్చిన అవకాశాన్ని 9.92 లక్షల మంది సద్వినియోగం చేసుకుని దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. ఈ ఓటర్లకు కార్డులు జారీకాకున్నా ఓటర్ల జాబితాలో పేర్లు ఉంటాయని తెలిపారు. ఎన్నికలు ముగిసిన తరువాత గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో 52,125 పోలింగ్ కేంద్రాలుండగా, ఈ ఐదేళ్లలో భారీగా ఓటర్లు పెరిగినందున 60,418 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 30 శాతం వరకు సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు ఈసీ తెలిపారు. ఒక్క చెన్నైలోనే 255 పోలింగ్ బూత్‌లు సమస్యాత్మకంగా భావించినట్లు చెప్పారు. ఈ బూత్‌లవద్ద సీఆర్‌పీఎఫ్ దళాన్ని బందోబస్తుగా పెడుతున్నామని అన్నారు. తీవ్ర సమస్యాత్మక కేంద్రాల వద్ద సీఆర్‌పీఎఫ్ దళాలు, సీసీ కెమెరా, వీడియో కెమెరాతో పోలింగ్ చిత్రీకరణ వంటి అదనపు బందోబస్తు చర్యలు చేపడుతున్నామని అన్నారు.
 
 భారీగా నగదు స్వాధీనం
 ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు పట్టుపడుతున్నట్లు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ఇంత వరకు 7 కిలోల బంగారు, రూ.2.16 కోట్ల నగదు పట్టుబడిందని తెలిపారు. ఇదికాక బుధవారం వివిధ వాహనాల తనిఖీల్లో భారీగా నగదు, నగలు పట్టుబడినట్లు ఆయన చెప్పారు. చెన్నైలో 2.5 కిలోల నగలు, ఆవడి సమీపంలో రూ.60 లక్షల నగదు, వలసరవాక్కంలో తెల్లవారుజామున రూ.2.14 లక్షల నగదు, గుడువాంజేరీలో రూ.1.50 లక్షలు పట్టుబడినట్లు తెలిపారు. పట్టుబడిన వాటికి సంబంధించి తగిన డాక్యుమెంట్లు చూపితే వాటిని తిరిగి అప్పగిస్తామని చెప్పారు.
 అన్నాడీఎంకేకు నోటీసు 
 ఈసీ అనుమతి లేకుండా ఇంటర్నెట్‌ల ద్వారా పార్టీ ప్రచారం తగదని, ఈ నిబంధన అన్నాడీంకే వర్తక విభాగం వారు మీరినందుకు బుధవారం నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. పార్టీల వెబ్‌సైట్‌ల ద్వారా ప్రచారం చేసుకుంటే తప్పులేదని, ఫేస్‌బుక్ వంటి సోషల్‌నెట్‌వర్క్‌ల ద్వారా ప్రచారం చేయరాదని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement