త్వరలోనే సర్దుబాటు : శరద్ పవార్ | election seats will be adjust soon :sharad pawar | Sakshi
Sakshi News home page

త్వరలోనే సర్దుబాటు : శరద్ పవార్

Published Sat, Oct 12 2013 11:55 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

election seats will be adjust soon :sharad pawar

 సాక్షి, ముంబై: రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే సీట్ల పంపకాలపై ఎన్సీపీ తీసుకున్న నిర్ణయం సరైందని పాతఫార్ములాతోనే కాంగ్రెస్ 26, ఎన్సీపీ 22 సీట్లపైనే పోటీ చేయాలని తాను కోరుకుంటున్నట్టు ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పష్టం చేశారు. రోహాలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన పలు విషయాలు తెలిపారు. సీట్ల పంపకం సమస్య తొందర్లోనే పరిష్కారమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేయాలని కోరుకుంటున్నారన్నారని చెప్పారు.
 
 జోషి సేనలోనే ఉంటారు
 శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి శివసేనను వీడనున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఎన్సీపీ అధిపతి తోసిపుచ్చారు. అలా ఆలోచించడం కూడా తప్పేనని శరద్ పవార్ పేర్కొన్నారు. జోషి తనతో భేటీ అయ్యారు కాబట్టి ఆయన పార్టీని వీడుతారంటూ వచ్చిన ఊహగానాలను తోసిపుచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల జోషి తనతో భేటీ అయ్యారని స్పష్టం చేశారు.
 
 చక్కెర ఫ్యాక్టరీల విక్రయాల్లో అవకతవకలు జరగలేదు  
 చక్కెర పరిశ్రమల క్రయవిక్రయాల్లో ఎలాంటి అవకతవకలూ జరగలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కూడా అయిన శరద్‌పవార్ పేర్కొన్నారు. వీటి విక్రయాల్లో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు.  ఇలాంటి ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. ఇలాంటి ఆరోపణలు చేసే వాళ్లు ఆర్థిక నిపుణులుగా కాబోరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలా ఆయన పరోక్షంగా అన్నా హజారే, మేధాపాట్కర్‌పై విమర్శలు గుప్పించారు.
 రాజ్యసభకు పోటీ చేస్తా...
 రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని శరద్ పవార్ మరోసారి ప్రకటించారు. అయితే 2014 ఫిబ్రవరిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. దీంతో ఆయన దేశ రాజకీయాల్లో మరి కొన్ని సంవత్సరాలపాటు క్రియాశీల పాత్ర పోషించనున్నారనేది స్పష్టమైంది.
 
 మోడీ దూకుడుతో లాభం లేదు
 గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ దూకుడు కారణంగా బీజేపీకి లోకసభ ఎన్నికల్లో విజయం లభించడం అసాధ్యమని పేర్కొన్నారు. ప్రజలంతా అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారు.  కేవలం లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడీ దూకుడుగా ప్రచారం చేస్తున్నారని పవార్ ఆరోపించారు. ఆయన స్వభావం తెలిసిన వాళ్లెవరూ ఓటు వేయబోరని, ఇది 2004 ఎన్నికల్లోనే స్పష్టమైందని చెప్పారు.  
 
 ఎంసీఏ ఎన్నికల్లో ముండే పోటీపై ఎద్దేవా...
 ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే బరిలోకి దిగనుండడాన్ని పవార్ తేలిగ్గా కొట్టిపారేశారు. ‘ముండే అభ్యర్థిత్వంతో నేను తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను!’ అంటూ చమత్కరించారు. ఎంసీఏ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement