భివండీ న్యూస్‌లైన్ : వచే ్చ నెల మొదటి వారంలో విద్యుత్ చార్జీలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే అభయమిచ్చారు. కాగా పట్టణంలో విద్యుత్ చార్జీలు విపరీతంగా ఉన్న కారణంగా 40 శాతం మేర పరిశ్రమలు మూతపడ్డాయి. మరికొన్ని మూతపడే దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పవర్‌లూమ్ సంఘర్ష్ సమితి సభ్యులు శుక్రవారం ముంబైలోని మంత్రాలయకు వెళ్లి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణేని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించకపోయినపట్టయితే పరిశ్రమల్లోని యంత్రాలను పాత ఇనుప సామగ్రి రూపంలో అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదని పవర్‌లూమ్ సంఘర్ష్ సమితి సభ్యులు మంత్రి రాణే దృష్టికి తీసుకెళ్లారు.
ఇందుకు రాణే స్పందిస్తూ నాగపూర్‌లో శాసనసభ శీతాకాల సమావేశాలు జరగడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అందుబాటులో లేరని, అందువల్ల మంత్రిమండలి సమావేశం జరగలేదని తెలిపారు. వచ్చే నెల మొదటివారంలో జరిగే సమావేశంలో విద్యుత్ చార్జీల తగ్గించేవిధంగా చర్యలు తీసుకుంటామని అభయమిచ్చారు. కాగా మంత్రిని కలసినవారిలో ఎమ్మెల్సీ సంజయ్ దత్, భివండీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షోయబ్ గుడ్డూ, ఫజల్ అన్సారీ. జావేద్ దల్వి తదితరులు ఉన్నారు. కాగా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబర్ ఏడో తేదీన మరమగ్గాల పరిశ్రమలన్నింటినీ మూసివేసి యజమానులు ఆందోళనకు దిగారు. భివండీ పవర్‌లూమ్ సంఘర్శ్ సమితి నేతృత్వంలో నవంబర్ ఆరు నుండి 15 వరకు పరిశ్రమల యజమానులు శాంతియుతంగా బంద్ పాటించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఆ తర్వాత రాస్తారోకోతోపాటు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టినా ఎంతమాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో సమితి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు సురేశ్ టావురే, సమితి సభ్యులు నవంబర్ 25న భివండీ నుంచి ముంబైలోని మంత్రాలయదాకా పాదయాత్ర ఆందోనలు చేపడతామంటూ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. ఇందుకు స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్య మంత్రి అజిత్ పవార్‌లు త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో చర్చించి విద్యుత్ చార్జీలు తగ్గించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో ఆయా యజమానులు ఆందోళనలను విరమించిన సంగతి విదితమే.
త్వరలో తగ్గిస్తాం
Published Fri, Dec 27 2013 10:47 PM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement
Advertisement