సాక్షి, ముంబై: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల వల్ల అధిక శాతం అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న నగరాల్లో ముంబై ముందు స్థానంలో ఉంది. దేశంలోని 88 నగరాలతో పోల్చుకుంటే నగరం అగ్రస్థానంలో ఉంది. 2008 నుంచి 2012 వరకు నగరంలో 245 అగ్ని ప్రమాదాలు జరుగగా ఇందులో 236 మంది మృత్యువాత పడ్డారు. ఇదే సమయంలో ఢిల్లీలో 185 అగ్ని ప్రమాదాల కేసులు నమోదు కాగా 186 మంది మృతి చెందినట్లు నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక బహిర్గతం చేసింది.
అదేవిధంగా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ (1,394 మంది మృతి), గుజరాత్ (1,204 మంది మృతి) తర్వాత మహారాష్ట్ర మూడవ స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమయంలో 1,095 అగ్ని ప్రమాదాలు సంభవించగా 820 మంది మరణించారు. కాగా, రాష్ట్రంలో ఏడాదికి అగ్ని ప్రమాదాల వల్ల సరాసరి 160 మంది మరణించగా నగరంలో 40 మంది మృత్యువాత పడుతున్నారు. ఇదిలా వుండగా 2011లో 331 అగ్ని ప్రమాదాలు సంభవించడంతో మహారాష్ట్ర రెండవ స్థానంలో నిలిచింది. ఇళ్లలో, వాణిజ్య సంస్థల్లో షార్ట్ సర్క్యూట్ల వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో మరణాల సంఖ్య పెరుగుతోందని నివేదికలో వెల్లడైంది. అదేవిధంగా 2008లో రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల వల్ల 120 మంది మృతి చెందగా 2009లో వీటి సంఖ్య 131కు పెరిగింది. కాగా 2010లో 152 మంది మరణించగా, 2011లో మృతుల సంఖ్య 263కు పెరుగగా, 2012లో 154 తగ్గిందని ఆ నివేదిక వెల్లడించింది. ఇదిలా వుండగా ‘నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా’ ప్రకారం 15 మీటర్ల కన్నా ఎత్తుగా ఉన్న భవనాలకు అగ్ని నిరోధక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అసిస్టెంట్ డివిజినల్ ఫైర్ ఆఫీసర్ హరీష్ శెట్టి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలో కొంతమంది భవనదారులు మాత్రమే అగ్ని ప్రమాదాలకు సంబంధించి భద్రతా నిబంధనలు పాటిస్తున్నారన్నారు. అయితే అమర్చిన పరికరాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కొన్నిసార్లు అవికూడా పనిచేయకుండా పోతున్నాయన్నారు.
కాగా, విద్యుత్‌బోర్డుల క్యాబిన్లలో ఇతర పనికిరాని వస్తువులను తెచ్చి ఉంచుతుండటంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇటీవల విక్రోలీలో అగ్ని ప్రమాదం జరిగిన ఎస్‌ఆర్‌ఏ భవనంలోని విద్యుత్ బోర్డు క్యాబిన్‌ను చెత్తా చెదారంతో నింపినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ క్యాబిన్ ఖాళీగా ఉండి ఉంటే అగ్ని ప్రమాదం చివరి అంతస్తు వరకు వ్యాపించి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే చాలా భవనాలకు ముందు అవసరమైన బహిరంగ స్థలం ఉంచకుండా నిర్మిస్తుండటంతో అత్యవసర సమయాల్లో ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడం అసాధ్యంగా మారుతోందని ఆయన తెలిపారు. ఫైర్ బ్రిగేడ్‌లు క్రమం తప్పకుండా నగర వ్యాప్తంగా ఉన్న హౌజింగ్ సొసైటీలు, ఆస్పత్రులు, వాణిజ్య సంస్థలు, ఇండస్ట్రియల్ యూనిట్లలో సర్వే నిర్వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ముంబై.. మండుతోంది!
Published Fri, Nov 15 2013 1:17 AM | Last Updated on Wed, Sep 5 2018 3:52 PM
Advertisement