- రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు పథకాలు : సీఎం
- వ్యవసాయ కళాశాలల్లో రైతుల పిల్లలకు రిజర్వేషన్లు
- వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి మరో 150 ఐటీఐలు
మైసూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలను రూపొందించనుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఇక్కడ నిర్వహించిన ఉద్యోగ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు సోమవారం ఆయన నియామక ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ కళాశాలలో రైతుల పిల్లల కోసం 40 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నామని వెల్లడించారు. యువత వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలను చేపట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని, ఉద్యోగ మేళాలకు తండోప తండాలుగా వస్తున్న వారిని చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. ఆది, సోమవారాల్లో ఇక్కడ నిర్వహించిన ఉద్యోగ మేళాలో 50 వేల మందికి పైగా నిరుద్యోగులు వచ్చారని, 220కి పైగా కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. ఎంపికైన వారంతా క్రమశిక్షణాయుతంగా ఉద్యోగాలు చేసుకోవాలని, తమకు ఉద్యోగాలిచ్చిన కంపెనీల పట్ల కృతజ్ఞతతో ఉండాలని ఉద్బోధించారు.
పరిశ్రమలను స్థాపించడానికి ముందు ఆయా పారిశ్రామికవేత్తలు ప్రకటించిన విధంగా స్థానికులకు విధిగా ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. కొన్ని కంపెనీలు స్వల్ప విషయాలకు ఉద్యోగాల నుంచి తొలగించే పనులు మానుకోవాలని హితవు పలికారు. కొందరు కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండడం లేదంటూ, ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని సభలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రికి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి 150 ఐటీఐలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.