చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో అన్నాడీఎంకేకు, కేంద్రంలో ఎన్‌డీఏకూ అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రకటించడంతో ఆయా పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. విజయోత్సవాలకు ఎవరికివారు సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే కొన్ని పార్టీలు ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కేవలం అంకెలగారెడీయేనంటూ కొట్టిపారేస్తున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు పడడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఇది ఈసారి కూడా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్ అభిప్రాయపడుతోంది. మొత్తం 40 స్థానాల్లో అధికార అన్నాడీఎంకే 20 నుంచి 31 స్థానాలకు అటూ ఇటుగా వస్తాయని సర్వేలతో జయ ఖుషీవివిధ సర్వేలు పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్‌పై ప్రధాన పార్టీల నేతలు పలువిధాలుగా స్పందించారు.
ఎగ్జిట్‌పోల్స్‌లో పేర్కొన్నట్లుగా 30 స్థానాల కంటే ఎక్కువ వస్తాయని అన్నాడీఎంకే పార్టీ అగ్రనేత చెప్పారు. డీఎంకే ధనవంతులను పోటీలో పెట్టి నెగ్గాలని చూసిందని ఆరోపించారు. ఈ క్రమంలో పేద ప్రజలను డీఎంకే నేతలు విస్మరించారని విమర్శించారు. ఈ ఫలితాన్ని వారు చవిచూడబోతున్నారని తెలిపారు. చెన్నైలోని మూడు లోక్‌సభ స్థానాలు తమకే దక్కుతాయని చెప్పారు.
ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఎప్పుడూ వాస్తవాలకు దూరమని డీఎంకే అగ్రనేత టీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. 2004, 2009లో ప్రకటించిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయని చెప్పారు. 2004 ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించిన సంఖ్యకంటే బీజేపీకి వందస్థానాలు తక్కువ వచ్చాయని అన్నారు. 2009లో బీజేపీ ప్రభుత్వమన్నారు, ఏదీ అని ప్రశ్నించారు. 2009లో అన్నాడీఎంకేకు 28 లోక్‌సభ స్థానాలన్నారు, కానీ దక్కింది 9 మాత్రమేనని చెప్పారు. ఈ సారి కూడా అదే పరిస్థితని చెప్పారు.
2004, 2009 ఎన్నికల్లో సైతం బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పాయని టీఎన్‌సీసీ అధ్యక్షులు జ్ఞానదేశికన్ అన్నారు. 2009లో బీజేపీకి 175-199 అని ఎగ్జిట్‌పోల్స్ చెప్పగా, 262 స్థానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఎగ్జిట్‌పోల్స్‌కు శాస్త్రీయబద్దత లేదని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం నెలరోజుల క్రితం ఒంటరిపోరు నిర్ణయం తీసుకున్నామని, మంచి ఫలితాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎగ్జిట్‌పోల్స్‌లో చూపిన దానికంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. దేశంలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత, మోడీ హవా బలంగా వీస్తోందని అన్నారు. కాశ్మీర్ - కన్యాకుమారి ప్రజలు మోడీ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. తమిళనాడులోనూ ఎక్కువ స్థానాలు సాధిస్తామని చెప్పారు.
ఒక్కో నియోజకవర్గంలో 12 లక్షల ఓటర్లుండగా కేవలం కొన్ని వందల మంది నుంచి సేకరించిన అభిప్రాయూలతో తయారైన ఎగ్జిట్‌పోల్స్ సర్వే వృథా అని పీఎంకే సహ ప్రధాన కార్యదర్శి ఏకే మూర్తి అన్నారు. డబ్బును ఎరగావేసి అధికారంలోకి రావడం కుదరదని, ప్రజలు డబ్బుకు లొంగరనే విషయం త్వరలోనే తేలుతుందని ఆయన అన్నారు. డబ్బు ప్రభావమే ఉంటే మొత్తం 300 స్థానాలను కొనుగోలు చేయగల ధనవంతులు దేశంలో ఎందరో ఉన్నారని ఆయన అన్నారు.
వామపక్షాలు
ఎప్పుడూ ఎగ్జిట్‌పోల్స్ సర్వే సరితూగలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జి రామకృష్ణన్ పేర్కొనగా, ఎగ్జిట్‌పోల్స్ భారతదేశంలో పనికిరావని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పాండియన్ పేర్కొన్నారు. ఆమెరికా, ఇంగ్లాండ్‌లలో కేవలం రెండే పార్టీలు ఉంటాయి కాబట్టి అక్కడ అనుకూలం, కానీ భారత్‌లో అనేక పార్టీలు, ఒక్కో రాష్టంలో ఒక్కో పార్టీల పెత్తనం వల్ల ఫలితాలు ఊహించలేమన్నారు.
నేడు చెన్నైకి జయ
ఇదిలా ఉండగా, ఈనెల 16వ తేదీ ఓట్ల లెక్కింపు దగ్గరపడుతుండగా సీఎం జయలలిత కొడనాడు నుంచి బుధవారం చెన్నైకి చేరుకుంటున్నారు. గత నెల 24వ తేదీన పోలింగ్ ముగిసిన తరువాత 27వ తేదీన విశ్రాంతి కోసం కొడనాడుకు వెళ్లారు. ఫలితాలు వెల్లడైన తరువాత మళ్లీ కొడనాడుకు వెళ్లిపోతారని అన్నాడీఎంకే పార్టీ ప్రకటించింది.
‘సర్వే’లతో జయ ఖుషీ
Published Wed, May 14 2014 12:39 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
Advertisement
Advertisement