ఏర్కాడులో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారికి జైలు శిక్ష తప్పదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. డిసెంబర్ రెండో తేదీతో ప్రచారం ముగించాలంటూ ఆంక్షల చిట్టాను ప్రకటించారు.
ఉల్లంఘిస్తే జైలే
Published Wed, Nov 27 2013 1:33 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
సాక్షి, చెన్నై : ఏర్కాడులో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారికి జైలు శిక్ష తప్పదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. డిసెంబర్ రెండో తేదీతో ప్రచారం ముగించాలంటూ ఆంక్షల చిట్టాను ప్రకటించారు. మరోవైపు అన్నాడీఎంకే అభ్యర్థి సరోజకు మద్దతుగా తెలుగు నేతలు ప్రచార బాట పట్టనున్నారు. సేలం జిల్లా ఏర్కాడు నియోజకవర్గంలో డిసెంబర్ 4న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ, డీఎంకే అభ్యర్థి మారన్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ ఉంది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ఇరు పార్టీల నాయకులు నియోజకవర్గంలో తిష్ట వేసి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ప్రచారం హోరెత్తుతుండటంతో నియోజకవర్గంలో ఎన్నికల వేడి తారా స్థాయికి చేరింది.
ఎన్నికకు వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఏర్పాట్లను ఎన్నికల యంత్రాం గం వేగవంతం చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధా న అధికారి ప్రవీణ్‌కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వారికి రెండేళ్లు జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించారు. ఎన్నికల పనులు వేగవంతం అయ్యాయని, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత పూరిత వాతావరణం లో ఎన్నికలను విజయవంతం చేస్తామన్నా రు. ప్రచారాన్ని డిసెంబర్ రెండో తేదీ సాయంత్రం ఐదు గంటలతో ముగించాలని, లేకుంటే చర్యలు తప్పదని హెచ్చరించారు. నియోజకవర్గంలో తిష్ట వేసి ఉన్న బయటి ప్రాంతాలకు చెందిన నాయకులు, ఇతరులు అదే రోజు బయటకు వెళ్లి పోవాలని సూచిం చారు.
పచారం పరిసమాప్తం అయ్యాక, ఏదేని మాధ్యమాల ద్వారానో, ఇతర కార్యక్రమాలు, ఉత్సవాల పేరిట ఓటర్లను ఆకర్షించే యత్నం చేసినా కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించారు. ఎన్నిక రోజున ఓటర్లకు ముందుగా అందజేసిన బూత్ స్లిప్పులను లేదా, తమ వద్ద ఉన్న గుర్తింపు కార్డులను పోలింగ్ కేంద్రాలకు తప్పని సరిగా తీసుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. గుర్తింపు కార్డులు ఉన్న వాళ్లను మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘస్తే రెండేళ్లు జైలు శిక్షతోపాటుగా రెండు లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. చీరలు, దోవతిల పట్టి వేత: ఓటర్లకు నోటు, తాయిలాల అడ్డుకట్ట దిశగా నిఘాను నియోజకవర్గంలో మరింత పటిష్టం చేశారు.
తాయిలాల పంపిణీ, కోడ్ ఉల్లంఘనపై డీఎంకే, అన్నాడీఎంకే నాయకులు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో మంగళవారం నియోజకవర్గం పరిధిలోని అయోధ్య పట్టణం సమీపంలో మినీ లారీని తనిఖీలు చేశారు. అందులో చీరలు, దోవతిలు ఉండటంతో స్వాధీనం చేసుకున్నా రు. ఆ లారీ డ్రైవర్ రాం కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలుగు నేతల ప్రచారం: అన్నాడీఎంకే అభ్యర్థి సరోజకు మద్దతుగా చెన్నైలోని తెలుగు వారు కదిలారు. ఏర్కాడు నియోజకవర్గం పరిధిలో తెలుగు వారు అధికంగా ఉన్నారు.
వీరి ఓట్లు అన్నాడీఎంకే అభ్యర్ధి సరోజకు మద్దతుగా వేయించడం లక్ష్యంగా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నేతృత్వంలో 50 మంది తెలుగు వారు ఏర్కాడుకు బయలుదేరారు. ఈ విషయమై తెలుగు యువశక్తి కార్యదర్శి డి శివశంకర్ మాట్లాడుతూ, ఏర్కాడులో తెలుగు వారు అధికంగా ఉండే ప్రాంతాల్లో బుధ, గురు వారాల్లో ప్రచారం చేయనున్నామన్నారు. ‘వాడ వాడలా అమ్మ మాట- బంగారు బాట’ అనే నినాదంతో తెలుగులో ప్రచారం చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే నెరవేర్చారని చెప్పారు. వాటన్నింటినీ అక్కడి తెలుగు వారి దృష్టికి తీసుకెళ్లే విధంగా తమ ప్రచారం సాగుతుందన్నారు.
Advertisement
Advertisement