Yercaud
-
రెండొందల ఏళ్ల బంగ్లాలో...
ఉన్నాయా? ఇంకా! ‘రెండొందల ఏళ్ల క్రితం కట్టిన బంగ్లాలు’ అనే డౌటొచ్చిందా? అటువంటి డౌట్స్ అస్సలు పెట్టుకోవద్దు. కొన్ని ఉన్నాయి! తమిళనాడులోని యార్కాడ్‌లో ఒకటుంది. కొన్ని రోజులుగా అప్పుడప్పుడూ త్రిష అక్కడే ఉంటున్నారు. అదీ సిన్మా కోసమే! ‘పరమపథమ్ విలయాట్టు’ అనే తమిళ థ్రిల్లర్‌లో త్రిష నటిస్తున్నారు. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రెండొందల ఏళ్ల పాత బంగ్లాలో తీస్తున్నారు. ఆ బంగ్లాకు ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే... ఒకప్పుడు అందులో మొఘల్ కింగ్ ఔరంగజేబు ఉండేవారట! ఇప్పుడు కుర్రాళ్ల జేబు వెనుక స్థానంలో (గుండెల్లో) కొలువున్న త్రిష ఉంటున్నారన్న మాట! యాక్చువల్‌గా ఈ సిన్మా షూటింగ్ చాలా రోజుల తర్వాత మొదలుకావల్సింది. విక్రమ్ ‘సామి–2’ నుంచి త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ డేట్స్‌ని త్రిష ఈ సిన్మాకి అడ్జస్ట్ చేశారు. 3 నెలల్లో సినిమాను చకచకా తీసేయాలనుకుంటున్నారట!! -
హిల్ స్టేషన్లో హ్యాపీగా...
అక్కడికెళ్లామంటే ప్రపంచంతో సంబంధాలు కట్ అయినట్లే. అలాంటి ప్లేస్ అది. ఇప్పుడు త్రిష అక్కడే ఉన్నారు. ఆ ప్లేస్ పేరు ‘ఏర్కాడ్’. తమిళనాడులో ఉంది, సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందవు. ఇవాళ చేతిలో సెల్‌ఫోన్ మోగకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా కుడి భుజం లేనట్లుగా కొంతమంది ఫీలవుతారు. కానీ, త్రిష మాత్రం హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే వెళ్లింది షూటింగ్‌కి కదా. ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకపోవడంతో హిల్ స్టేషన్లో హ్యాపీగా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ‘పరమపదమ్’ అనే సినిమా చిత్రీకరణ ఏర్కాడ్‌లో జరుగుతోంది. ఇందులో త్రిష డాక్టర్ రోల్ చేస్తున్నారట. తిరుజ్ఞానమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. సమాజానికి సేవ చేయాలనుకునే ఓ డాక్టర్ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేది మెయిన్ పాయింట్ అని సమాచారం. మరో మూడు వారాల పాటు ఏర్కాడ్లోనే షూటింగ్. సో.. త్రిష దాదాపు ఎవరికీ అందుబాటులో ఉండరన్న మాట. అందుకే మూడు నాలుగు రోజులుగా త్రిష సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేరు. ఈ సినిమాతో కలిపి ఈ బ్యూటీ చేతిలో మరో ఆరేడు చిత్రాలు ఉన్నాయి. వచ్చే ఏడాది వీటిలో మినిమమ్ ఐదు సినిమాలైనా రిలీజవుతాయని ఊహించవచ్చు. ఒకే ఏడాది ఐదు సినిమాలంటే గ్రేట్. మరి.. త్రిషానా! మజాకా! అన్నట్లు ఈ బ్యూటీ త్వరలో ‘హే జుడే’తో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. -
ఏర్కాడులో అన్నాడీఎంకే అభ్యర్థి ముందంజ
తమిళనాడు ఏర్కాడు నియోజకవర్గంలో అధికార అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి విజయం దిశగా దూసుకుపోతున్నారు. డీఎంకే అభ్యర్థి వీ మారన్ పై అన్నా డీఎంకే అభ్యర్థి పి సరోజ 4800 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. 15729 ఓట్లు లెక్కింపు జరుపగా 432 ఓట్లు నోటా బటన్ ద్వారా వచ్చాయని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. డిసెంబర్ 4 తేదిన జరిగిన ఉప ఎన్నికల్లో ఏర్కాడు నియోజకవర్గంలో పదకొండు మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అన్నాడీఎంకే అభ్యర్థి సి పెరుమాల్ మృతితో ఉప ఎన్నిక జరిగింది. దాంతో పెరుమాల్ సతీమణి సరోజ ఎన్నికల బరిలో నిలిచారు. -
ప్రశాంతంగా పోలింగ్
సాక్షి, చెన్నై: నిఘా నీడలో ఏర్కాడు ఉప సమరం బుధవారం ప్రశాంతం గా ముగిసింది. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడంతో గెలుపుపై ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పెరుమాళ్ మరణంతో ఏర్కాడు రిజర్వుడు స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక లోక్ సభ ఎన్నికలకు రెఫరెండంగా డీఎంకే, అన్నాడీఎంకేలు పరిగణించాయి. డీఎంకే అభ్యర్థి మారన్, అన్నాడీఎంకే అభ్యర్థి సరోజతోపాటుగా మరో తొమ్మిది మంది ఇండిపెండెంట్లు ఎన్నికల రేసులో నిలబడటంతో సమరం ఆసక్తికరంగా మారింది. ప్రధాన పక్షాల మధ్య గట్టి పోటీ ఉన్నా, ఓట్ల చీలిక ఎక్కడ గండి కొడుతుందేమోనన్న బెంగ మొదలైంది.ప్రశాంతంగా ఓటింగ్: నియోజకవర్గం పరిధిలోని 290 పోలింగ్ కేంద్రాల్లో చెదురుమదురు ఘటనల మినహా బుధవారం ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. 2500 మంది పారా మిలటరీ బలగాలు, స్థానిక పోలీసుల సహకారంతో గట్టి భద్రత మధ్య ఉదయం ఎన్నికలు జరిగింది. 41 పోలింగ్ కేంద్రాలు అటవీ గ్రామాల్లో ఉండటం, మరో 21 కేంద్రాలు కొండ ప్రదేశాల్లో ఉండటంతో అటు అధికారులు, ఇటు భద్రతా సిబ్బంది నానాతంటాలు పడాల్సి వచ్చింది. ఉదయం ఏడున్నర గంటలకే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నానికి అనేక కేంద్రాల్లో 75 శాతం మేరకు ఓటింగ్ జరిగింది. ఏర్కాడు పరిసరాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం ఐదు గంటలైనా, ఓటర్లు బారులు తీరే ఉన్నారు. దీంతో వారికి టోకెన్లను అందజేసి ఓట్లు వేసే అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో తొలి సారిగా నోటా బటన్ ఉపయోగించారు. ఓటింగ్ సరళిని అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్ కెమెరాల ద్వారా ఆన్లైన్లో సేలం జిల్లా కలెక్టర్ మకర భూషణం, చెన్నైలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ పర్యవేక్షించారు. సాయంత్రానికి ఇది వరకు ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు అయింది. పోలింగ్ 89.75 నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. గెలుపుపై ఎవరి ధీమా వారిది: ఓటింగ్ ముగియడంతో గెలుపుపై అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల్లో ధీమా పెరిగింది. అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ ఉదయం తన భర్త పెరుమాళ్ సమాధి వద్ద నివాళులర్పించినానంతరం ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన స్వగ్రామం వాల్పాడి సమీపంలోని పాప్పనాయకన్ పట్టి పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో తాను గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే అభ్యర్థి మారన్ తన స్వగ్రామం పూవలూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాను 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. -
సర్వం సిద్ధం
సాక్షి, చెన్నై: ఏర్కాడు ఉప సమరానికి సర్వం సిద్ధమైంది. బుధవారం పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను కల్పించారు. ఎన్నికల సరళి పరిశీలనకు 21 మంది ప్రత్యేక పర్యవేక్షకులు రంగంలోకి దిగారు. అన్ని పోలింగ్ బూత్‌లలో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు రెఫరెండంగా భావించి తీర్పు ఇవ్వాలని ఓటర్లకు సీఎం జయలలిత పిలుపునిచ్చారు. తాను ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించలేదని ఈసీకి వివరణ ఇచ్చారు. ఏర్కాడు ఉప ఎన్నికలు అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఉపసమరాన్ని లోక్‌సభ ఎన్నికలకు రెఫరెండంగా మలుచుకునేందుకు ఆ రెండు పార్టీలు నిర్ణయించాయి. ప్రధాన పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేతోపాటుగా మొత్తం 11 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో మంగళవారం ఉదయం నుంచి అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బుధవారం నిర్వహించే పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలకు ఉపయోగించే ఈవీఎంలను, విధులకు హాజరయ్యే అధికారులను, సిబ్బందినీ భద్రత నడుమ ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపించారు. అభ్యర్థి నచ్చకుంటే ఉపయోగించే నోటా బటన్‌ను రాష్ట్రంలో ప్రపథమంగా ఈ ఎన్నికకు పరిచయం చేస్తున్నారు. తొలిసారిగా ఆ బటన్‌ను నొక్కే అవకాశం ఏర్కాడులోని కొందరు ఓటర్లకు దక్కబోతున్నది. ప్రత్యేక పర్యవేక్షకులు బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఎన్నికల సరళిని పరిశీలించేందుకు ప్రత్యేక పర్యవేక్షకులు 21 మందిని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం రంగంలోకి దించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా వీడియోలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. 290 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా ఆయా కేంద్రాల్లో రికార్డు అయ్యే దృశ్యాల్ని చెన్నై నుంచి ఈసీ ప్రవీణ్‌కుమార్ వీక్షించనున్నారు. 29 సమస్యాత్మక కేంద్రాల్లో ఐదు అంచెల భద్రతను, మిగిలిన కేంద్రాల్లో మూడు అంచెల భద్రతను కల్పించారు. పారా మిలిటరీ బలగాలు 2500 మందితో పాటు, స్థానిక పోలీసులను భద్రతకు నియమించారు. ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపుకార్డులను లేదా, ముందుగా జారీ చేసిన బూత్ స్లిప్పులు కలిగి ఉండే వాళ్లను మాత్రమే పోలింగ్ కేంద్రాల పరిసరాల్లోకి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఏర్కాడు ఓటర్లకు పిలుపు నిస్తూ సీఎం జయలలిత ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికలకు రెపరెండంగా నిలిచే రీతిలో తమ తీర్పును ఓటర్లు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. కోడ్ ఉల్లంఘించ లేదు: ఏర్కాడు ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత కోడ్ ఉల్లంఘించి ప్రత్యేక పథకాల్ని, హామీల్ని ప్రకటించినట్టు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేరాయి. దీంతో ఆమెకు ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. దీనికి మంగళవారం సీఎం జయలలిత వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి ప్రత్యేక పథకాల్ని, ప్రకటనల్ని చేయలేదని స్పష్టం చేశారు. కోడ్ ఉల్లంఘించే విధంగా తన ప్రసంగం సాగలేదని వివరించారు. తాను తమిళంలోనే ప్రసంగించానని, నియోజకవర్గంలోని సమస్యలు తన దృష్టికి వచ్చి ఉన్నాయని మాత్రమే తాను పేర్కొన్నానన్నారు. అయితే, పలాన పనులు అని ప్రత్యేకంగా సూచించలేదని, రోడ్లు వేయిస్తానని, నీటి పథకాలు ప్రవేశ పెడతానని తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తన ప్రసంగాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. -
రేపే పోలింగ్
సేలం జిల్లా ఏర్కాడు నియోజకవర్గ ఉప ఎన్నికల సమరంలో భాగంగా సోమవారం ప్రచారహోరుకు తెరపడింది. దాదాపు నెలరోజుల పాటూ వాగ్దానాలు, విమర్శనాస్త్రాలతో ఊదరగొట్టిన నేతలు పోలింగ్ వ్యూహాల్లో మునిగిపోయారు. ప్రత్యర్థులు పరస్పరం ఇచ్చిన ఫిర్యాదులతో మంత్రి, ఎంపీ సహా 61 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం పోలింగ్ నిర్విహంచనున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏర్కాడు పోటీ నుంచి వైదొలగడంతో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల మధ్యనే ద్విముఖ పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీల నుంచి పెద్దసంఖ్యలో నేతలు నియోజకవర్గంలో తిష్టవేసి అభ్యర్థుల గెలుపుకోసం ప్రచా రం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా నే సీఎం జయ మంత్రివర్గ సభ్యులతో ప్రచార బృందాన్ని నియమించారు. ఈనెల 28వ తేదీన జయలలిత సుడిగాలి పర్యటన చేయగా, డీఎంకే తరపున పార్టీ కోశాధికారి స్టాలిన్‌తోపాటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. పచారానికి చివరిరోజైన సోమవార మంత్రులు పన్నీర్ సెల్వం, నత్తం విశ్వనాథన్, ఆర్ వైద్యలింగం, ఏ పళనిస్వామి, ఆర్ మోహ న్, వలర్మతి, పళనియప్పన్ తదితరులు నియోజకవర్గంలో పర్యటించారు. స్టాలిన్ సైతం 4 గంటలవరకు ప్రచారం చేశారు. మైకులతో హోరెత్తిన నియోజవర్గంలో నిశ్శబ్దం తాండవం చేస్తూ ఒక్కసారిగా ప్రశాంత వాతావరణం నెల కొంది. 5 గంటలు దాటిన తరువాత ప్రచారం నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ ఇప్పటికే హెచ్చరించిం ది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు వెంటనే నియోజకవర్గాన్ని విడిచివెళ్లాలని ఆదేశించింది. నాలుగు ప్రత్యేక బృందాలు నియోజకవర్గంలోని అతిథిగృహాలు, కల్యాణ మండపాలు, నేతల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నాయి. సోమవారం సాయంత్రం 5 నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు టాస్మాక్ దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరుపక్షాలపై కేసులు: ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు పరస్పరం చేసుకున్న ఫిర్యాదులు మేరకు మొత్తం 61 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాళప్పాడి సమీపం అనుప్పురం రాజపాళెయంలో అన్నాడీఎంకే కార్యకర్తలు ఓటర్లకు ఇటీవల డబ్బులు పంచుతుండగా డీఎంకేవారు అడ్డుతగిలారు. ఈ సంఘటనలో ఇరపక్షాలు బాహాబాహీకి దిగడంతో పలువురు గాయపడి ఆస్పత్రుల్లో చేరా రు. దీనిపై మంత్రి రాజేంద్రబాలాజీ సహా 30 మంది అన్నాడీఎంకే కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నా డీఎంకే నేతలు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని 31 మందిపై కేసులు పెట్టారు. -
ప్రచారానికి నేటితో తెర!
ఏర్కాడు ఉప ఎన్నిక ఓటర్లకు కానుకల వర్షాన్ని కురిపిస్తోంది. సమరం హోరాహోరీ కావడంతో ఓటుకు రూ.2 వేలు వరకు పంపిణీ చేస్తున్నారు. ప్రచారానికి సోమవారం సాయంత్రం తెర పడనుండడంతో అధికార పార్టీ మంత్రులు, ఆయా పార్టీల నాయకులు, ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఖాళీ చేసి బయటకు వచ్చేయాలని ఈసీ హుకుం జారీ చేసింది. సాక్షి, చెన్నై: ఏర్కాడు ఉప ఎన్నికకు మరో రోజు మాత్రమే సమ యం ఉన్నది. నాలుగో తేదీ ఉదయం 8 గంటల నుంచి పోలిం గ్ ఆరంభం కానుంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్నిఏర్పాట్లను ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి చేసింది. 290 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 25 గ్రామాలు సమస్యాత్మకంగా గుర్తించింది. ఈ కేంద్రాల్లో భద్రత నిమిత్తం పారా మిలటరీ రంగంలోకి దిగింది. ఆదివారం 450 మందితో కూడిన ఓ బృందం, 250 మందితో కూడిన మరో బృందం సేలంకు చేరుకుంది. ఆయా కేంద్రాలకు ఈవీఎంలను, ఎన్నికల సామగ్రిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక బయలుదేరండి : ఉప ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తెర పడనుంది. నియోజకవర్గంలో తిష్ట వేసిన బయటి వ్యక్తులందరూ వెళ్లి పోవాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంతో సంబంధం లేని 20 మందికి పైగా మంత్రులు, మరో 30 మందికి పైగా అన్నాడీఎంకే ముఖ్య నేతలు ఇన్నాళ్లు ఇక్కడ తిష్ట వేశారు. వీరందరూ సోమవారం సాయంత్రం ఐదు గంటల్లోపు వెళ్లిపోవాలని హుకుం జారీ అయింది. ఒక వేళ నియోజకవర్గంలో సంబంధం లేని వ్యక్తులు తిష్ట వేసి ఉన్నట్టు గుర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై చర్యలు చేపట్టాలని ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారులను రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. భలే ఛాన్స్: ఉప ఎన్నిక ఓటర్లకు కానుకల వర్షాన్ని కురిపిస్తోంది. డీఎంకే అభ్యర్థి మారన్, అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ మధ్య సమరం హోరాహోరీగా మారడంతో ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున తాయిలాల పంపిణీ జరుగుతోంది. ఎన్నికల కమిషన్ బురిడీ కొట్టించే రీతిలో కొత్త పంథాను నేతలు అనుసరిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్య నాయకులకు ఆహ్వానం పలికే విధంగా కర్పూర హారతి ఇచ్చే కొత్త తట్టలు, మర్యాద పూర్వకంగా కలశాల తరహాలో ఉండే చిన్న పాటి బిందెలతోపాటు అందులో కానుకల్ని ఉంచి, అందజేయడం విశేషం. రాత్రుల్లో జోరుగా నగదు పంపిణీ జరుగుతోంది. ఓ వర్గం ఓటుకు రూ. రెండు వేలు, పంచె ధోవతి, చీరలు పంచుతుంటే, మరో వర్గం రూ.500తో సరి పెడుతోంది. అర్ధరాత్రి పన్నెండు నుంచి ఐదు గంటల్లోపు ఈ పంపిణీ జరుగుతుండటం గమనార్హం. శనివారం రాత్రి మిన్నపల్లి, కార్యం పట్టి, కరుమాపురం, అయోధ్యపట్నం, చెల్లియం పాళయం, చిన్నగౌండపరం, వెల్లల గుండం, వలసయూర్ గ్రామాల్లో నగదు పంపిణీ వివాదానికి దారి తీసింది. డిఎంకే , అన్నాడిఎంకే వర్గాలు తన్నుకోవడంతో బండారం బయట పడింది. తనిఖీలు ముమ్మరం: ఓటింగ్‌కు మరో రోజు మాత్రమే గడువు ఉండటంతో తాయిలాల పంపిణీకి అడ్డుకట్ట వేసే విధంగా తనిఖీలు ముమ్మరం చేశారు. అన్ని ప్రాంతాల్లో, కూడళ్లల్లో చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. ఐదు వేల మంది స్థానిక పోలీసులతో పాటుగా ఎనిమిది వందల మంది పారా మిలటరీ సిబ్బంది భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం జరిపిన తనిఖీల్లో రూ.3.17 లక్షలు విలువగల నాన్ స్టిక్ తవా సామన్లు పట్టుబడ్డాయి. ఇది ఓటర్లకు పంపిణీ చేయడానికి తీసుకెళ్తున్నట్టుగా అనుమానాలు బలపడటంతో విచారణ జరుపుతున్నారు. -
ఏర్కాడుపై డేగ కన్ను
చెన్నై, సాక్షి ప్రతినిధి: నగదు, వస్త్రాలు, మద్యం పంపిణీలతో ఓటర్లను లోబరుచుకునే అవకాశాలు ఉండటంతో శుక్రవారం నుంచి వాహనాల తనిఖీని మరింత ముమ్మరం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారి రవిప్రసాద్ , ఐఆర్ఎస్ అధికారి పంకజ్ నియోజకవర్గ పరిశీలకులుగా పనిచేస్తున్నారు. 240 మందితో కూడిన నాలుగు కంపెనీల సైనిక దళాలు, 300 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటూ సేలం పోలీసులు బందోబస్తు పనిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 చోట్ల ప్రత్యేక చెక్‌పోస్టులు, నియోజకవర్గంలో 18 చెక్‌పోస్టులు పెట్టి 24 గంటల తనిఖీ నిర్వహిస్తున్నారు. భారీ వాహనాలు మొదలుకుని ద్విచక్ర వాహనాలను, పోలీసులు, ప్రభుత్వాధికారుల వాహనాలను సైతం విడిచిపెట్టకుండా తనిఖీ నిర్వహిస్తున్నారు. 272 పోలింగ్ కేంద్రాల్లో వీడి యో కెమెరాలను అమర్చి ఇంటర్నెట్తో అనుసంధానం చేశారు. డిసెంబరు 4న పోలింగ్ నిర్వహిస్తుండగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు ప్రచారం ముగింపురోజు 2వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు. 2వ తేదీ తరువాత మొబైల్ ఫోన్లతో ఎస్ఎమ్ఎస్ల ద్వారా కూడా ప్రచారం చేయరాదని పేర్కొంటూ ఈ మేరకు మొబైల్ ఫోన్ కంపెనీలను ఆదేశించారు. సీఎం కారు తనిఖీ నియోజకవర్గంలో గురువారం పర్యటనకు వెళ్లిన సీఎం జయలలిత ప్రయాణిస్తున్న కారును సైతం తనిఖీ చేశారు. వాళప్పాడి సమీపం ముత్తంపట్టి చెక్‌పోస్టు వద్ద సేలం ఎస్పీ శక్తివేల్ కారును ఆపారు. అధికారుల ఆదేశాల మేరకు కారును తనిఖీ చేస్తామని సీఎంను కోరగా ఆమె అంగీకరించారు. తాళ్లూరు మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ మీనా సీఎం కారును రెండు నిమిషాలపాటూ తనిఖీ చేశారు. ఆ తరువాత సీఎం వెళ్లిపోయారు. స్టాలిన్ ప్రచారం డీఎంకే అభ్యర్థి నాగమారన్ తరపున ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్ శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 21 చోట్ల ప్రచారం నిర్వహించారు. వచ్చేనెల 2వ తేదీ వరకు మొత్తం 78 ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తారు. హైకోర్టు పర్యవేక్షించదు ఏర్కాడులో ఉపఎన్నికలు సజావుగా జరిగేలా కోర్టు పర్యవేక్షించాలంటూ డీఎంకే కార్యనిర్వహణా కార్యదర్శి టి.కె.ఎస్ ఇళంగోవన్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల పర్యవేక్షణకు ఎన్నికల సంఘాలు, కమిషన్లు ఉన్నాయని, ఉప ఎన్నికల పర్యవేక్షణ హైకోర్టు విధుల్లో ఒక అంశం కాదని హైకోర్టు జస్టిస్ కె.కె.శశిధరన్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలను సీనియర్ కౌన్సిల్ అధికారి జి.రాజగోపాలన్ హైకోర్టుకు ముందుగానే నివేదించారన్నారు. -
ఏర్కాడులో కేతిరెడ్డి ప్రచారం
చెన్నై, సాక్షి ప్రతినిధి: సేలం జిల్లా ఏర్కాడు ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ గెలుపుకోసం తమిళనాడు తెలుగు యువశక్తి బుధవారం సుడిగాలి పర్యటన నిర్వహించింది. నియోజకవర్గ పరిధిలోని తెలుగు ప్రజల మద్దతును కూడగట్టే నిమిత్తం యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అనేక ప్రాంతాల్లో పర్యటిం చారు. వలసూరు, అయోధ్యపట్నం, పెరుమాళుపాళం, కుప్పనూరు, పళ్లిపట్టు తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి తెలుగు వారిని, ఇతర ఓటర్లను కలిశారు. అనేక చోట్ల తెలుగు మహిళలు ఆయనకు మంగళ హారతులు పట్టి స్వాగతం పలికారు. అమ్మ పాలనలో చేపట్టిన పథకాల గురించి వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను కేతిరెడ్డి పంచిపెట్టారు. అన్నాడీఎం అభ్యర్థి సరోజను గెలిపించడం ద్వారా అమ్మ పాలనకు మద్దతు పలకాలని ఓటర్లను కోరారు. కేతిరెడ్డి వెంట మంత్రి కామరాజ్, రాయపురం ఎమ్మెల్యే జయకుమార్, చెన్నై టీనగర్ ఎమ్మెల్యే కలైరాజన్, తెలుగు యువశక్తి రాము, సేలం కార్యదర్శి డి.శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగదు పంపిణీలో ఘర్షణ పెరియ గౌండపురం బస్టాండు సమీపంలో మంగళవారం రాత్రి అన్నాడీఎంకే నేతలు ఓటర్లకు పంచెలు, చీరలు, నగదు పంపిణీ చేస్తుండగా డీఎంకే నేతలు అడ్డు తగిలారు. దీంతో ఆగ్రహించిన అధికార పార్టీ వారు మారణాయుధాలతో దాడులకు దిగారు. ఇదిలా ఉండగా ఎన్నికల నిబంధనలను అతిక్రమించారంటూ మంత్రులు వలర్మతి, సెంథిల్‌బాలాజీ సహా 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేడు జయ పర్యటన అధికార పార్టీ అభ్యర్థి సరోజ గెలుపు కోసం సీఎం జయలలిత గురువారం ఏర్కాడులో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్త ఉదయం 11.30 గంటలకు ఆమె ఏర్కాడు చేరుకుంటారు. 9 చోట్ల ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో ఆమె ప్రసంగిస్తారు. ఏర్కాడు ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల బాధ్యతలను నిర్వరిస్తున్న మంతుల బృందం జయ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసింది. -
ఉల్లంఘిస్తే జైలే
సాక్షి, చెన్నై : ఏర్కాడులో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారికి జైలు శిక్ష తప్పదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. డిసెంబర్ రెండో తేదీతో ప్రచారం ముగించాలంటూ ఆంక్షల చిట్టాను ప్రకటించారు. మరోవైపు అన్నాడీఎంకే అభ్యర్థి సరోజకు మద్దతుగా తెలుగు నేతలు ప్రచార బాట పట్టనున్నారు. సేలం జిల్లా ఏర్కాడు నియోజకవర్గంలో డిసెంబర్ 4న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ, డీఎంకే అభ్యర్థి మారన్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ ఉంది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ఇరు పార్టీల నాయకులు నియోజకవర్గంలో తిష్ట వేసి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ప్రచారం హోరెత్తుతుండటంతో నియోజకవర్గంలో ఎన్నికల వేడి తారా స్థాయికి చేరింది. ఎన్నికకు వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఏర్పాట్లను ఎన్నికల యంత్రాం గం వేగవంతం చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధా న అధికారి ప్రవీణ్‌కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వారికి రెండేళ్లు జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించారు. ఎన్నికల పనులు వేగవంతం అయ్యాయని, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత పూరిత వాతావరణం లో ఎన్నికలను విజయవంతం చేస్తామన్నా రు. ప్రచారాన్ని డిసెంబర్ రెండో తేదీ సాయంత్రం ఐదు గంటలతో ముగించాలని, లేకుంటే చర్యలు తప్పదని హెచ్చరించారు. నియోజకవర్గంలో తిష్ట వేసి ఉన్న బయటి ప్రాంతాలకు చెందిన నాయకులు, ఇతరులు అదే రోజు బయటకు వెళ్లి పోవాలని సూచిం చారు. పచారం పరిసమాప్తం అయ్యాక, ఏదేని మాధ్యమాల ద్వారానో, ఇతర కార్యక్రమాలు, ఉత్సవాల పేరిట ఓటర్లను ఆకర్షించే యత్నం చేసినా కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించారు. ఎన్నిక రోజున ఓటర్లకు ముందుగా అందజేసిన బూత్ స్లిప్పులను లేదా, తమ వద్ద ఉన్న గుర్తింపు కార్డులను పోలింగ్ కేంద్రాలకు తప్పని సరిగా తీసుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. గుర్తింపు కార్డులు ఉన్న వాళ్లను మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘస్తే రెండేళ్లు జైలు శిక్షతోపాటుగా రెండు లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. చీరలు, దోవతిల పట్టి వేత: ఓటర్లకు నోటు, తాయిలాల అడ్డుకట్ట దిశగా నిఘాను నియోజకవర్గంలో మరింత పటిష్టం చేశారు. తాయిలాల పంపిణీ, కోడ్ ఉల్లంఘనపై డీఎంకే, అన్నాడీఎంకే నాయకులు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో మంగళవారం నియోజకవర్గం పరిధిలోని అయోధ్య పట్టణం సమీపంలో మినీ లారీని తనిఖీలు చేశారు. అందులో చీరలు, దోవతిలు ఉండటంతో స్వాధీనం చేసుకున్నా రు. ఆ లారీ డ్రైవర్ రాం కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలుగు నేతల ప్రచారం: అన్నాడీఎంకే అభ్యర్థి సరోజకు మద్దతుగా చెన్నైలోని తెలుగు వారు కదిలారు. ఏర్కాడు నియోజకవర్గం పరిధిలో తెలుగు వారు అధికంగా ఉన్నారు. వీరి ఓట్లు అన్నాడీఎంకే అభ్యర్ధి సరోజకు మద్దతుగా వేయించడం లక్ష్యంగా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నేతృత్వంలో 50 మంది తెలుగు వారు ఏర్కాడుకు బయలుదేరారు. ఈ విషయమై తెలుగు యువశక్తి కార్యదర్శి డి శివశంకర్ మాట్లాడుతూ, ఏర్కాడులో తెలుగు వారు అధికంగా ఉండే ప్రాంతాల్లో బుధ, గురు వారాల్లో ప్రచారం చేయనున్నామన్నారు. ‘వాడ వాడలా అమ్మ మాట- బంగారు బాట’ అనే నినాదంతో తెలుగులో ప్రచారం చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే నెరవేర్చారని చెప్పారు. వాటన్నింటినీ అక్కడి తెలుగు వారి దృష్టికి తీసుకెళ్లే విధంగా తమ ప్రచారం సాగుతుందన్నారు.