ఏర్కాడు ఉప ఎన్నిక ఓటర్లకు కానుకల వర్షాన్ని కురిపిస్తోంది. సమరం హోరాహోరీ కావడంతో ఓటుకు రూ.2 వేలు వరకు పంపిణీ చేస్తున్నారు. ప్రచారానికి సోమవారం సాయంత్రం తెర పడనుండడంతో
ప్రచారానికి నేటితో తెర!
Published Mon, Dec 2 2013 1:52 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
ఏర్కాడు ఉప ఎన్నిక ఓటర్లకు కానుకల వర్షాన్ని కురిపిస్తోంది. సమరం హోరాహోరీ కావడంతో ఓటుకు రూ.2 వేలు వరకు పంపిణీ చేస్తున్నారు. ప్రచారానికి సోమవారం సాయంత్రం తెర పడనుండడంతో అధికార పార్టీ మంత్రులు, ఆయా పార్టీల నాయకులు, ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఖాళీ చేసి బయటకు వచ్చేయాలని ఈసీ హుకుం జారీ చేసింది. సాక్షి, చెన్నై: ఏర్కాడు ఉప ఎన్నికకు మరో రోజు మాత్రమే సమ యం ఉన్నది. నాలుగో తేదీ ఉదయం 8 గంటల నుంచి పోలిం గ్ ఆరంభం కానుంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్నిఏర్పాట్లను ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి చేసింది. 290 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 25 గ్రామాలు సమస్యాత్మకంగా గుర్తించింది. ఈ కేంద్రాల్లో భద్రత నిమిత్తం పారా మిలటరీ రంగంలోకి దిగింది. ఆదివారం 450 మందితో కూడిన ఓ బృందం, 250 మందితో కూడిన మరో బృందం సేలంకు చేరుకుంది. ఆయా కేంద్రాలకు ఈవీఎంలను, ఎన్నికల సామగ్రిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక బయలుదేరండి : ఉప ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తెర పడనుంది. నియోజకవర్గంలో తిష్ట వేసిన బయటి వ్యక్తులందరూ వెళ్లి పోవాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంతో సంబంధం లేని 20 మందికి పైగా మంత్రులు, మరో 30 మందికి పైగా అన్నాడీఎంకే ముఖ్య నేతలు ఇన్నాళ్లు ఇక్కడ తిష్ట వేశారు. వీరందరూ సోమవారం సాయంత్రం ఐదు గంటల్లోపు వెళ్లిపోవాలని హుకుం జారీ అయింది. ఒక వేళ నియోజకవర్గంలో సంబంధం లేని వ్యక్తులు తిష్ట వేసి ఉన్నట్టు గుర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై చర్యలు చేపట్టాలని ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారులను రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు.
భలే ఛాన్స్: ఉప ఎన్నిక ఓటర్లకు కానుకల వర్షాన్ని కురిపిస్తోంది. డీఎంకే అభ్యర్థి మారన్, అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ మధ్య సమరం హోరాహోరీగా మారడంతో ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున తాయిలాల పంపిణీ జరుగుతోంది. ఎన్నికల కమిషన్ బురిడీ కొట్టించే రీతిలో కొత్త పంథాను నేతలు అనుసరిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్య నాయకులకు ఆహ్వానం పలికే విధంగా కర్పూర హారతి ఇచ్చే కొత్త తట్టలు, మర్యాద పూర్వకంగా కలశాల తరహాలో ఉండే చిన్న పాటి బిందెలతోపాటు అందులో కానుకల్ని ఉంచి, అందజేయడం విశేషం. రాత్రుల్లో జోరుగా నగదు పంపిణీ జరుగుతోంది. ఓ వర్గం ఓటుకు రూ. రెండు వేలు, పంచె ధోవతి, చీరలు పంచుతుంటే, మరో వర్గం రూ.500తో సరి పెడుతోంది. అర్ధరాత్రి పన్నెండు నుంచి ఐదు గంటల్లోపు ఈ పంపిణీ జరుగుతుండటం గమనార్హం.
శనివారం రాత్రి మిన్నపల్లి, కార్యం పట్టి, కరుమాపురం, అయోధ్యపట్నం, చెల్లియం పాళయం, చిన్నగౌండపరం, వెల్లల గుండం, వలసయూర్ గ్రామాల్లో నగదు పంపిణీ వివాదానికి దారి తీసింది. డిఎంకే , అన్నాడిఎంకే వర్గాలు తన్నుకోవడంతో బండారం బయట పడింది. తనిఖీలు ముమ్మరం: ఓటింగ్‌కు మరో రోజు మాత్రమే గడువు ఉండటంతో తాయిలాల పంపిణీకి అడ్డుకట్ట వేసే విధంగా తనిఖీలు ముమ్మరం చేశారు. అన్ని ప్రాంతాల్లో, కూడళ్లల్లో చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. ఐదు వేల మంది స్థానిక పోలీసులతో పాటుగా ఎనిమిది వందల మంది పారా మిలటరీ సిబ్బంది భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం జరిపిన తనిఖీల్లో రూ.3.17 లక్షలు విలువగల నాన్ స్టిక్ తవా సామన్లు పట్టుబడ్డాయి. ఇది ఓటర్లకు పంపిణీ చేయడానికి తీసుకెళ్తున్నట్టుగా అనుమానాలు బలపడటంతో విచారణ జరుపుతున్నారు.
Advertisement
Advertisement