సేలం జిల్లా ఏర్కాడు ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ గెలుపుకోసం తమిళనాడు తెలుగు యువశక్తి బుధవారం సుడిగాలి పర్యటన నిర్వహించింది.
ఏర్కాడులో కేతిరెడ్డి ప్రచారం
Published Thu, Nov 28 2013 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి: సేలం జిల్లా ఏర్కాడు ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ గెలుపుకోసం తమిళనాడు తెలుగు యువశక్తి బుధవారం సుడిగాలి పర్యటన నిర్వహించింది. నియోజకవర్గ పరిధిలోని తెలుగు ప్రజల మద్దతును కూడగట్టే నిమిత్తం యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అనేక ప్రాంతాల్లో పర్యటిం చారు. వలసూరు, అయోధ్యపట్నం, పెరుమాళుపాళం, కుప్పనూరు, పళ్లిపట్టు తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి తెలుగు వారిని, ఇతర ఓటర్లను కలిశారు. అనేక చోట్ల తెలుగు మహిళలు ఆయనకు మంగళ హారతులు పట్టి స్వాగతం పలికారు. అమ్మ పాలనలో చేపట్టిన పథకాల గురించి వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను కేతిరెడ్డి పంచిపెట్టారు. అన్నాడీఎం అభ్యర్థి సరోజను గెలిపించడం ద్వారా అమ్మ పాలనకు మద్దతు పలకాలని ఓటర్లను కోరారు. కేతిరెడ్డి వెంట మంత్రి కామరాజ్, రాయపురం ఎమ్మెల్యే జయకుమార్, చెన్నై టీనగర్ ఎమ్మెల్యే కలైరాజన్, తెలుగు యువశక్తి రాము, సేలం కార్యదర్శి డి.శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నగదు పంపిణీలో ఘర్షణ
పెరియ గౌండపురం బస్టాండు సమీపంలో మంగళవారం రాత్రి అన్నాడీఎంకే నేతలు ఓటర్లకు పంచెలు, చీరలు, నగదు పంపిణీ చేస్తుండగా డీఎంకే నేతలు అడ్డు తగిలారు. దీంతో ఆగ్రహించిన అధికార పార్టీ వారు మారణాయుధాలతో దాడులకు దిగారు. ఇదిలా ఉండగా ఎన్నికల నిబంధనలను అతిక్రమించారంటూ మంత్రులు వలర్మతి, సెంథిల్‌బాలాజీ సహా 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నేడు జయ పర్యటన
అధికార పార్టీ అభ్యర్థి సరోజ గెలుపు కోసం సీఎం జయలలిత గురువారం ఏర్కాడులో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్త ఉదయం 11.30 గంటలకు ఆమె ఏర్కాడు చేరుకుంటారు. 9 చోట్ల ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో ఆమె ప్రసంగిస్తారు. ఏర్కాడు ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల బాధ్యతలను నిర్వరిస్తున్న మంతుల బృందం జయ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసింది.
Advertisement
Advertisement