నగదు, వస్త్రాలు, మద్యం పంపిణీలతో ఓటర్లను లోబరుచుకునే అవకాశాలు ఉండటంతో శుక్రవారం నుంచి వాహనాల తనిఖీని మరింత ముమ్మరం చేశారు.
ఏర్కాడుపై డేగ కన్ను
Published Sat, Nov 30 2013 2:25 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: నగదు, వస్త్రాలు, మద్యం పంపిణీలతో ఓటర్లను లోబరుచుకునే అవకాశాలు ఉండటంతో శుక్రవారం నుంచి వాహనాల తనిఖీని మరింత ముమ్మరం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారి రవిప్రసాద్ , ఐఆర్‌ఎస్ అధికారి పంకజ్ నియోజకవర్గ పరిశీలకులుగా పనిచేస్తున్నారు. 240 మందితో కూడిన నాలుగు కంపెనీల సైనిక దళాలు, 300 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందితోపాటూ సేలం పోలీసులు బందోబస్తు పనిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 చోట్ల ప్రత్యేక చెక్‌పోస్టులు, నియోజకవర్గంలో 18 చెక్‌పోస్టులు పెట్టి 24 గంటల తనిఖీ నిర్వహిస్తున్నారు.
భారీ వాహనాలు మొదలుకుని ద్విచక్ర వాహనాలను, పోలీసులు, ప్రభుత్వాధికారుల వాహనాలను సైతం విడిచిపెట్టకుండా తనిఖీ నిర్వహిస్తున్నారు. 272 పోలింగ్ కేంద్రాల్లో వీడి యో కెమెరాలను అమర్చి ఇంటర్నెట్‌తో అనుసంధానం చేశారు. డిసెంబరు 4న పోలింగ్ నిర్వహిస్తుండగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు ప్రచారం ముగింపురోజు 2వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు. 2వ తేదీ తరువాత మొబైల్ ఫోన్లతో ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా కూడా ప్రచారం చేయరాదని పేర్కొంటూ ఈ మేరకు మొబైల్ ఫోన్ కంపెనీలను ఆదేశించారు.
సీఎం కారు తనిఖీ
నియోజకవర్గంలో గురువారం పర్యటనకు వెళ్లిన సీఎం జయలలిత ప్రయాణిస్తున్న కారును సైతం తనిఖీ చేశారు. వాళప్పాడి సమీపం ముత్తంపట్టి చెక్‌పోస్టు వద్ద సేలం ఎస్పీ శక్తివేల్ కారును ఆపారు. అధికారుల ఆదేశాల మేరకు కారును తనిఖీ చేస్తామని సీఎంను కోరగా ఆమె అంగీకరించారు. తాళ్లూరు మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ మీనా సీఎం కారును రెండు నిమిషాలపాటూ తనిఖీ చేశారు. ఆ తరువాత సీఎం వెళ్లిపోయారు.
స్టాలిన్ ప్రచారం
డీఎంకే అభ్యర్థి నాగమారన్ తరపున ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్ శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 21 చోట్ల ప్రచారం నిర్వహించారు. వచ్చేనెల 2వ తేదీ వరకు మొత్తం 78 ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తారు.
హైకోర్టు పర్యవేక్షించదు
ఏర్కాడులో ఉపఎన్నికలు సజావుగా జరిగేలా కోర్టు పర్యవేక్షించాలంటూ డీఎంకే కార్యనిర్వహణా కార్యదర్శి టి.కె.ఎస్ ఇళంగోవన్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల పర్యవేక్షణకు ఎన్నికల సంఘాలు, కమిషన్లు ఉన్నాయని, ఉప ఎన్నికల పర్యవేక్షణ హైకోర్టు విధుల్లో ఒక అంశం కాదని హైకోర్టు జస్టిస్ కె.కె.శశిధరన్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలను సీనియర్ కౌన్సిల్ అధికారి జి.రాజగోపాలన్ హైకోర్టుకు ముందుగానే నివేదించారన్నారు.
Advertisement
Advertisement