డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు జైలుగూటి పక్షులే !
► అవినీతిలో ఊబిలో తమిళనాడు
► ఎన్నికల ప్రచారంలో సీపీఐ
► జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ
డెంకణీకోట : తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు జైలుగూటి పక్షులని, ఆ పార్టీల కేరాఫ్ అడ్రస్ జైలేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ అన్నారు. మంగళవారం ఆయన క్రిష్ణగిరి జిల్లాలోని తళి నియోజక వర్గంలో సీపీఐ అభ్యర్థి టి. రామచంద్రన్‌కు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డెంకణీకోటలో జరిగిన ఎన్నికల సభలో ఓటర్లనుద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో తమిళనాడు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ప్రజా సంక్షేమ కూటమి ఏర్పడిందని ఆయన అన్నారు.
ఉచితం సొంత డబ్బుతో అందించండి
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఓటర్లకు ఇచ్చే ఉచిత పథకాలు పార్టీల నాయకులు సొంత డబ్బుతో ఇస్తే సంతోషిస్తామని, ప్రజలపై పన్నుల భారం మోపి వారిని దోచుకోవడం తగదన్నారు. మళ్లీ ప్రజలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ఓటు వేస్తే మళ్లీ ఐదేళ్లు మోసపోతారని పేర్కొన్నారు.
తమిళనాడు అభివృద్ధి కుంటు
తమిళనాడులో ప్రాంతాయ పార్టీలతో అభివృద్ధి ఆగిపోయిందని నారాయణ ఆరోపించారు. వీరి పాలనలో అవినీతి తాండవించిందని ఆరోపించారు. ప్రజా సంక్షేమ కూటమి పాలనలోకి వస్తే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు జైలులో ఉంటాయన్నారు.
తమిళనాడు రాజరిక సంస్కృతి
తమిళనాడులో ప్రజాప్రతినిధులను బానిసలుగా చూస్తున్నారని, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పాదాలకు మొక్కవలసిందేనని, జయలలితలో రాచరికపు సంస్కృతి వేళ్లూనుకొందని మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులు జయలలిత కాళ్లకు మొక్కడం ఏమిటని ఆయన నిలదీశారు. ఓటర్ల ఆత్మాభిమానం కోసం ప్రజా సంక్షేమ కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు.
కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై పోరాడని పార్టీలు
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక చర్యలను తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు వ్యతిరేకించడంలేదని, బీజేపీకి తొత్తులుగా ఉన్న పార్టీలను తిప్పికొట్టాలని సూచించారు. తళి నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి టి. రామచంద్రన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హర్షధ్వనాల మధ్య కోరారు. డెంకణీకోట, కెలమంగలం తదితర ప్రాంతాలలో సీపీఐ అభ్యర్థి టి. రామచంద్రన్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.