► నేడు పరిశీలన
► ప్రచారంలో అభ్యర్థులు
► పంచముఖ సమరం హోరు
► రూ.19 లక్షల నగదు, 3 కేజీల బంగారం పట్టివేత
► పుదుచ్చేరిలో అన్నాడీఎంకేకు రంగస్వామి మద్దతు
ఉప ఎన్నికల నామినేషన్లకు తెరపడింది. గురువారం పరిశీలన, శుక్రవారం ఉపసంహరణ పర్వాలు సాగనున్నాయి. నామినేషన్ల సమర్పణతో ఓట్ల వేటలో అభ్యర్థులు దూసుకెళుతున్నారు. పంచముఖ సమరంలో గెలుపు లక్ష్యంగా తీవ్రంగా కుస్తీలు పట్టే పనిలో పడ్డారు.
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆగిన తంజావూరు, అరవకురిచ్చి నియోజకవర్గాలతో పాటుగా ఎమ్మెల్యే శీనివేల్ మరణంతో ఖాళీ ఏర్పడిన తిరుప్పరగుండ్రం నియోజకవర్గానికి ఈ నెల 19న ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకు గత నెల 26 నుంచి నామినేషన్లను స్వీకరిస్తూ వచ్చారు. ఈ పర్వం బుధవారంతో ముగిసింది. అరవకురిచ్చిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, డీఎంకే అభ్యర్థిగా సీనియర్ నాయకుడు పళని స్వామి, బీజేపీ అభ్యర్థిగా ప్రభు, పీఎంకే అభ్యర్థిగా భాస్కరన్, డీఎండీకే అభ్యర్థిగా అరవై ముత్తులతో పాటు 59 మంది నామినేషన్లను దాఖలు చేశారు.
రేసులో ఎంత మంది ఉన్నా, ప్రధాన సమరం అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే సాగనుంది. ఇక, తంజావూరులో డీఎంకే అభ్యర్థిగా డాక్టర్ అంజుగం భూపతి, అన్నాడీఎంకే అభ్యర్థిగా రంగస్వామి, బీజేపీ అభ్యర్థిగా ఎంఎస్.రామలింగం, డీఎండీకే అభ్యర్థిగా అబ్దుల్ షేట్, పీఎంకే నుంచి కురింజి పాదం, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా నల్లదురై నామినేషన్లను సమర్పించారు. మొత్తంగా 13 మంది నామినేషన్లను వేశారు. ఇక్కడ మాత్రం ఆయా పార్టీలకు చెందిన ఆరుగురు అభ్యర్థులు రేసులో ఉండడం గమనార్హం.
మదురై జిల్లా తిరుప్పరగుండ్రంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే.బోసు, డీఎంకే నుంచి శరవణన్, ధనపాండియన్-డీఎండీకే, సీఎంకే నుంచి సెల్వంతో పాటు 22 మంది నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల పర్వం ముగియడంతో అధికార వర్గాలు పరిశీలనను వేగవంతం చేయనున్నారు. గురువారం పరిశీలన, శుక్రవారం ఉపసంహరణ పర్వం ముగించి, అదే రోజు తుది జాబితాను ప్రకటించనున్నారు.
గెలుపే లక్ష్యం : నామినేషన్లను సమర్పించిన అభ్యర్థులు గెలుపు లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక, ఎన్నికల ఏర్పాట్ల మీద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖాని దృష్టి సారించారు. తుది జాబితా తదుపరి ఓటింగ్ తగ్గ కసరత్తుల్ని వేగవంతం చేయనున్నారు. ఆయా నియోజకవర్గ అధికారులతో సమాలోచనలు, ఎన్నికల సామగ్రి సిద్ధం తదితర ప్రక్రియల్లో స్థానిక ఎన్నికల పర్యవేక్షణాధికారులు నిమగ్నమయ్యారు.
తనిఖీలు ముమ్మరం : ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా తనిఖీలను ముమ్మరం చేశారు. అదనంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీల్లో నిమగ్నమయ్యారు. మదురై జిల్లా మేలూరు సమీపంలోని టోల్ గేట్ వద్ద జరిపిన తనిఖీల్లో ఓ కారులో రూ.19 లక్షల నగదు, మూడు కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ప్రకాష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అన్నాడీఎంకేకు మద్దతు : పుదుచ్చేరి నెల్లితోప్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ స్వామి కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులో ఉన్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే, కాంగ్రెస్, వీసీకే వర్గాలు ప్రచారంలో దూసుకెళుతున్నారుు. ఇక, పుదియ తమిళగం సైతం నారాయణ స్వామికి మద్దతు ప్రకటించింది. కాగా, పుదుచ్చేరి ప్రధాన ప్రతిపక్షం ఎన్‌ఆర్.కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలిచేనా? అన్న ఎదురు చూపులు చివరి క్షణం వరకు నెలకొన్నారుు. అరుుతే, వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఎన్నికల నుంచి తప్పుకున్న ఎన్‌ఆర్.కాంగ్రెస్, తమ మద్దతును అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తిశేఖర్‌కు ప్రకటించారు. ఈ మేరకు ఎన్‌ఆర్.కాంగ్రెస్ నేత రంగస్వామి ఈ ప్రకటన చేశారు.
నామినేషన్లకు తెర
Published Thu, Nov 3 2016 3:55 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
Advertisement
Advertisement